జిల్లాలపై ఏకపక్ష నిర్ణయమేల?
* జిల్లాల ఏర్పాటుకు రాజ్యాంగ ప్రాతిపదికేది: టీజేఏసీ ఆక్షేపణ
* ప్రభుత్వానిది తొందరపాటు నిర్ణయం
* ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం సమగ్రమైంది కాదు
* సీసీఎల్‌ఏకు లేఖ రాయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సమగ్ర నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన చేపట్టిందని తెలంగాణ జేఏసీ ఆక్షేపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244, షెడ్యూల్ 5లోని అంశాలను పట్టించుకోకుండా కొత్త జిల్లాల పని ప్రారంభిస్తామనడం తొందరపాటు చర్యగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది.
ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీసీఎల్‌ఏకు ఒకట్రెండు రోజుల్లో జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం లేఖ రాయనున్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల విభజన అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటుచేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల భాష, సంస్కృతులు, చరిత్ర, జీవనవిధానం, అభివృద్ధి, వెనుకబాటుతనం, వనరులు వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ కమిషన్ సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. దీని ప్రకారమే 1956లో దేశంలోని రాష్ట్రాలను పునర్విభజన చేశారు.
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనూ అదే స్ఫూర్తితో జిల్లాల విభజన జరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరిస్తోంది’’ అని జేఏసీ లేఖ రాయనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు అవసరమేనని, అయితే అందుకు హేతుబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఎక్కడుందని జేఏసీ ప్రశ్నిస్తోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర నివేదిక తయారుచేస్తే జిల్లాల పునర్విభజనలో గందరగోళం, ప్రజల మధ్య వైషమ్యాలు తలెత్తేవి కావని భావిస్తోంది. ‘‘అధికారంలోకి వచ్చిన పార్టీలు తమ ఇష్టానుసారం కాకుండా శాసనబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పునర్విభజన చేపట్టాలి.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల(ఏర్పాటు)చట్టం సమగ్రమైంది కాదు. జిల్లాల సరిహద్దుల మార్పునకు తప్ప ఇప్పుడున్న జిల్లాల్లాగా సమగ్ర స్వరూపాన్ని మార్చాలంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అనువైన కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసర ం ఉంది. కానీ చట్టం లేకుండా, శాసనసభలో చర్చించకుండా ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ జిల్లాల చట్టం-1974ను దత్తత తీసుకుంటూ ఉత్తర్వుల ద్వారా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది’’ అని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణకు ప్రత్యేక చట్టం రూపొందించే దాకా జిల్లాల పునర్విభజన ప్రక్రియను నిలిపివేయడం మంచిదంటూ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు జేఏసీ సిద్ధమైంది.
కొత్త జిల్లాల ఏర్పాటును నిలిపివేయకుండా ముందుకే వెళ్లాలనుకుంటే కొన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వానికి జేఏసీ సూచించింది. ఆ సూచనలివీ..
⇒ విస్తీర్ణం, జనాభా, ఆదాయం, ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోవాలి
⇒ చారిత్రక, భౌగోళిక నేపథ్యాలు, భౌతిక లక్షణాలు, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు, సమస్యలు, విద్యా, సాంస్కృతిక అంశాలు, అభివృద్ధి వనరులు, సౌకర్యాలను అధ్యయనం చేయాలి
⇒ ఆ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూడాలి
⇒ పరిపాలనా సౌలభ్యం, మంచి పరిపాలన ఇవ్వడం లక్ష్యంగా ఉండాలి
⇒ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు నిర్దిష్ట ప్రాతిపదికను ప్రకటించాలి
⇒ జిల్లాల ఏర్పాటు తుది నిర్ణయం ప్రజాభీష్టం ప్రాతిపదికగా జరగాలి
⇒ షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనా సమగ్రతను పెంపొందించే లక్ష్యంగా ఆ ప్రాంతాలను ఎక్కడికక్కడ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి