గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే.. మరో వైపు... ఓటర్ లిస్టు నుంచి పేర్ల తొలగింపు పెద్ద సంఖ్యలో కొనసాగుతోంది. తాజాగా.. సీపీఐ పార్టీ జాతీయ నేత నారాయణ, ఆయన సతీమణి వసుమతి పేర్లు.. ఓటర్ల లిస్టు నుంచి తొలగించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సాక్షాత్తు నాపేరే లిస్టులో లేదు. దీన్నిబట్టే ఓటర్ల జాబితాలో ఎన్ని అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.
మరో వైపు ఇప్పటికే రాజకీయ దురుద్దేశంతో జంట నగరాల్లో 30లక్షలకు పైగా ఓట్లు జాబితా నుంచి తొలగించారంటూ ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీనిపై 14 మంది సభ్యుల బృందం అఖిల పక్షంతో సమావేశమై విచారణ చేపట్టింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి సునీల్‌గుప్తా ఆధ్వర్యంలో నగరానికి వచ్చిన అధికారులు ఓటరు జాబితాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖుల పేర్లు కూడా ఓటర్ లిస్టులో కనిపించకుండా పోవడంతో సర్వత్రా విమర్శలు ఎదురైతున్నాయి. ప్రముఖుల పేర్లే ఓటర్ లిస్టులో గల్లంతైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు.