మెట్రో రైలు క్యాబిన్ పరిశీలిస్తున్న సీవీ ఆనంద్
మెట్రో రైలు డిపోలు, స్టేషన్లలో భద్రతా పరిస్థితిని సైబరాబాద్ పోలీసు కమిషన్ సీవీ ఆనంద్ పరిశీలించారు. హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఇంజనీర్లతో కలిసి ఆయన ఉప్పల్ డిపో, ఓసీసీ, నాగోల్-మెట్టుగూడ మధ్య ఉన్న మెట్రో స్టేషన్లను పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. 2015 మార్చిలో మెట్రో మొదటిదశ ప్రారంభం కావాల్సిన విషయం తెలిసిందే. మెట్రో స్టేషన్లు, డిపో, ఓసీసీ తదితర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలో చూశారు.
కాపలా లేనిచోట్ల సెన్సర్లు, అలారంల ఏర్పాటు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల వద్ద ప్రయాణికుల తనిఖీ, లగేజి స్కానర్లు, చొరబాటు నిరోధ వ్యవస్థలు.. ఇలా అన్నింటినీ పరిశీలించారు. స్టేషన్ల వద్ద రద్దీ నియంత్రణ వ్యవస్థలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలనూ సీవీ ఆనంద్ తదితరులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడి భద్రతపై తమ అంచనా వివరాలను త్వరలోనే అందిస్తామని ఆనంద్ తెలిపారు. అలాగే నాగోలు -మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్లు ఏ స్టేషన్ పరిధిలోకి రావాలన్న అంశాలపై కూడా చర్చించారు.