
అసెంబ్లీ కమిటీల నివేదికల అమల్లో జాప్యం తగదు
శాసనసభ కమిటీల నివేదికలను సభలో ప్రవేశపెట్టిన అనంతరం వాటిని ప్రభుత్వం అమలు చేయకపోవటంపై సోమవారం స్పీకర్..
♦ సభ్యుల ఆవేదన..
♦ సభలో ప్రస్తావించాలన్న స్పీకర్ కోడెల
సాక్షి, హైదరాబాద్: శాసనసభ కమిటీల నివేదికలను సభలో ప్రవేశపెట్టిన అనంతరం వాటిని ప్రభుత్వం అమలు చేయకపోవటంపై సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగిన ప్రాథమిక సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీల నివేదికలు సభలో ప్రవేశపెట్టిన తరువాత వాటిని ప్రభుత్వం అమలు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సోమవారం అసెంబ్లీ క మిటీ హాలులో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ప్రజా పద్దుల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీల ప్రాథమిక సమావేశం జరిగింది. కమిటీలనుద్దేశించి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రసంగించారు.
కార్యక్రమంలో ఆయా కమిటీల చైర్మన్లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (పీఏసీ), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (ఎస్టిమేట్స్), కాగిత వెంకట్రావు (పీయూసీ), శాసనసభ ఇన్‌చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణ, సభ్యులు, ప్రిన్సిపాల్ ఎకౌంటెంట్ జనరల్ (కాగ్) హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు గత ఏడేళ్లుగా ఉమ్మడి, ఏపీ అసెంబ్లీలో కమిటీల నివేదికలు ప్రవేశ పెట్టడం లేదని, ఒకవేళ కొన్ని కమిటీల నివేదికలు ప్రవేశపెట్టినా వాటిని ప్రభుత్వం స్వీకరించి అమలు చేసిన దాఖలాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
కమిటీ లు సమర్పించే నివేదికలను నిర్దిష్ట గడువులోగా సభ ముందు ఉంచటంతోపాటు వాటిపై తీసుకున్న చర్యల నివేదికలను ప్రభుత్వం తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పీకర్ కోడెల స్పందిస్తూ కమిటీల నివేదికలు సభలో ప్రవేశపెట్టి అమలు చేయటం అనేది చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. అయితే నివేదికలు సభలో ప్రవేశ పెట్టకపోయినా, అమలు చేయకపోయినా ప్రభుత్వాన్ని సభలో సభ్యులు ప్రశ్నించవచ్చన్నారు.
రెండు విడతలుగా నిర్వహించాలి..
బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించాలని, తొలుత ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన తరువాత దానిపై రెండో విడత జరిగే సమావేశాల్లో చర్చించాలని కమిటీకి హాజరైన సభ్యులు స్పీకర్‌కు సూచించారు. కమిటీ సమావేశాల్లో స్పీకర్ కోడెల ప్రసంగిస్తూ కమిటీల విధివిధానాలు, పోషించాల్సిన పాత్రపై త్వరలో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు కమిటీలు ప్రాథమిక సమావేశం అనంతరం విడివిడిగా భేటీ అయ్యాయి.