6 వేల స్కూళ్లలో డిజిటల్ తరగతులు
మరో 6 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ మెషీన్లు: కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 6 వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తరగతులు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్‌ఎస్‌ఏ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన డీఈఓల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మరో 6వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు స్కూల్ గ్రాంట్లు, మెయింటెనెన్స్ గ్రాంట్లు ఇకపై వేర్వేరుగా ఇస్తామని, జూన్ నెలాఖరు నాటికి నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగం పెంచామన్న మంత్రి కడియం.. కొత్త టీచర్లు వచ్చేందుకు ఆర్నెల్ల సమయం పడుతుందని, అప్పటి వరకు విద్యా వలంటీర్లు నియమించుకునేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కొన్ని పాఠశాలల్లో టీచర్లు సెలవులో ఉన్నప్పుడు బోధన ఆగిపోతోందని, మున్ముందు అలా జరగకుండా 20మంది ఉపాధ్యాయులను అదనంగా నియమించి అందుబాటులో ఉంచుతామన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాలకు సంబంధించి డీఈఓలకు శిక్షణ ఇవ్వాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను మంత్రి ఆదేశించారు. జూన్ 12లోపు మరోసారి డీఈఓల సదస్సు నిర్వహిస్తామనని, సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,637 స్కూళ్ల విలీనం!
20 మంది లోపు విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు 4,637 ఉన్నట్లు తేల్చింది. వాస్తవానికి ఈ పాఠశాలల విలీన ప్రతి పాదనలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఎస్‌ఎస్‌ఏ సమావేశ మందిరంలో జరిగిన డీఈఓల భేటీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు ప్రకటించినట్లు తెలిసింది. జీరో ఎన్‌రోల్‌మెంట్, 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తే మెరుగైన ఫలితాలుంటాయని, పాఠశాలలు తెరిచే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.