టీఆర్‌ఎస్‌కు ఓటేసి మోసపోవద్దు
నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చింది పీజేఆర్
హైకోర్టు మొట్టికాయలేస్తేనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి
పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ మల్లు రవి
బంజారాహిల్స్: నగరంలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోమారు ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటేసి మోసపోవద్దని మాజీ ఎంపీ, ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకులు మల్లు రవి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంగళవారం వెంకటేశ్వరనగర్ కాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.14 నందినగర్ గ్రౌండ్‌లో నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గారఢీ విద్యలో సీఎం కేసీఆర్ ఆరితేరారని గత ఎన్నికల్లో కూడా తన గారఢీతో ప్రజలను మోసం చేశారని ఈసారి కూడా మోసగించేందుకు సిద్ధమవుతున్నారని వారి ఆటలు సాగనివ్వవద్దని ప్రజలకు సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కళ్లబొల్లి మాటలతో మళ్లీ గెలుద్దామని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే హైదరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులని ఈ సారి గతంలో చేసిన పొరపాట్లు చేయరనే నమ్మకం ఉందన్నారు. టీఆర్‌ఎస్ ఇప్పటిదాకా ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదని, తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
నాయకత్వం అంటే మంత్రి పదవి వల్ల రాదని ప్రజల కోసం పోరాటం చేసేవారే నాయకులని అలాంటి నాయకులు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పి. జనార్ధన్‌రెడ్డి, దానం నాగేందర్ అని పేర్కొన్నారు. వీరిద్దరూ ప్రజల హృదయాల్లో నిలబడ్డారని వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారని ప్రజలు పిలిస్తే క్షణాల్లో వెళ్లేవారని గుర్తు చేశారు. పేదల సమస్యలు తమవిగా భావించారని అందుకే ఖైరతాబాద్‌ను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చారని చెప్పారు. ఇప్పుడు ప్రజల మీద ప్రేమతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పెట్టడం లేదని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో పెడుతున్నారని దుయ్యబట్టారు. బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి. భారతి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నాడు పేదలు సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. రేషన్‌కార్డులు తొలగించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. పింఛన్లు తీసేసి అర్హులను అడుక్కుతినేలా మార్చారని దుయ్యబట్టారు. ప్రజల బతుకులను దుర్భరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దానం నాగేందర్ తల్లి దశదిన కర్మ పూర్తయ్యేంత వరకు బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో హాజరు కాలేకపోయారు.