హోదాపై టీడీపీది ద్వంద్వ వైఖరే
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపాటు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో అధికార టీడీపీ తొలి నుంచీ ద్వంద్వ వైఖరినే ప్రదర్శిస్తోందని, ఈ అంశంపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరోమాట మాట్లాడుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ నాటకాలు ఆడకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లు ఇప్పటికే ఉండగా టీడీపీ బుధవారం మరో బిల్లును ఇచ్చి చర్చ కావాలని కోరడం దారుణమని విమర్శించారు.
ఇప్పటికే ఉన్న బిల్లుపై ఓటింగ్ జరగాలని పట్టుపట్టాల్సింది పోయి సాంకేతిక కారణాలు చూపుతూ మరో బిల్లును ఇవ్వడం సరికాదన్నారు. అసలు రాష్ట్రానికి అన్యాయం చేయడానికే టీడీపీ అధికారంలోకి వచ్చిందా? అని ధ్వజమెత్తారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వ్యక్తిగత అవసరాల కోసం కేంద్రంతో రాజీపడ్డారని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, బీజేపీలకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేనే లేదని పార్థసారథి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ప్రధాని వద్దకు తీసుకెళ్లి అడగాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.
జీవో 40ని పున:సమీక్షించాలి
ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 40ని పున:సమీక్షించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ఓపెన్ కేటగిరీ లో అర్హత సాధించిన మహిళలనూ 33 శాతం రిజర్వేషన్ల కేటగిరీలో చేరుస్తూ జీవో ఇవ్వడం దారుణమన్నారు. మహిళలకు అన్యాయం జరిగేలా జీవో ఇచ్చారని విమర్శించారు.