ఎంసెట్-2 ఆలస్యం!
- ‘నీట్’ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి వివరణ కోరిన నేపథ్యంలోనే..
- కేంద్రం ఆర్డినెన్స్ కాపీ అందాక తేదీలు ప్రకటించనున్న రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు మెడికల్ ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా అందుకు సంబంధించిన తదుపరి చర్యలు మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ‘నీట్’ను ఈ ఏడాదికి వాయిదా వేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదానికి పంపగా ఆయన ఆర్డినెన్స్‌పై కేంద్రాన్ని వివరణ కోరారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ కాపీ అందాక నోటిఫికేషన్, పరీక్ష తేదీలను ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. ఆర్డినెన్స్ వెంటనే వస్తుందని భావించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారమే తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. కానీ ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్దే నిలిచిపోవడంతో రాష్ట్రంలో అందుకు సంబంధించిన ప్రక్రియ కేంద్ర పరిణామాలను బట్టి ఆలస్యమయ్యే సూచనలున్నాయి. మొత్తం ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి వైద్య తరగతులు ప్రారంభించాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. ఆర్డినెన్స్ వచ్చాకే నోటిఫికేషన్, పరీక్ష తేదీలను ప్రకటిస్తామని కాళోజీ నారాయణరావు తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
విద్యార్థుల్లో ఆందోళన...
ప్రస్తుతం ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో దాని ఆమోదానికి ఎంతకాలం పడుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డినెన్స్ అధికారికంగా అమల్లోకి రాకుండా నోటిఫికేషన్, పరీక్ష తేదీలు ప్రకటించడం వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర లభించకుండా ఆర్డినెన్స్ అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు కాదని... కానీ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ అమల్లోకి రాకుండానే మెడికల్ ఎంసెట్ ఫలితాలు ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తప్పుబడుతున్నాయి.
ఒకవేళ రాష్ట్రపతి ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఏపీ మెడికల్ ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థులు ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అన్‌రిజర్వుడు కోటా (15 శాతం సీట్లు)లో పోటీ పడాల్సి ఉండటం, ఈ సీట్లను రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు వారి ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉండటంతో తమ పిల్లలకు సీట్లు వస్తాయన్న నమ్మకం లేదనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో అలాంటి విద్యార్థులు కూడా తెలంగాణ మెడికల్ ఎంసెట్-2 కోసం నిరీక్షిస్తున్నారు.