విద్యుత్ బాదుడుకు ఈఆర్సీ ఒకే | ERC permission to increase electricity charges | Sakshi
Sakshi News home page

విద్యుత్ బాదుడుకు ఈఆర్సీ ఒకే

Published Tue, Apr 26 2016 6:59 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

విద్యుత్ బాదుడుకు ఈఆర్సీ ఒకే - Sakshi

విద్యుత్ బాదుడుకు ఈఆర్సీ ఒకే

రూ.1400 కోట్ల చార్జీల పెంపునకు సమ్మతి
►  సర్కారుకు చేరిన కొత్త టారిఫ్
►  పాలేరు ఉప ఎన్నిక తర్వాత పెంపు?

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్త టారిఫ్ ఉత్తర్వులను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సిద్ధం చేసి ప్రభుత్వ అభిప్రాయం కోసం ఇంధన శాఖకు పంపింది. రూ.1,958 కోట్ల చార్జీల పెంపు కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈఆర్సీకి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లను సమర్పించడం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ  అనంతరం స్వల్ప మార్పులతో కొత్త టారిఫ్‌ను ఈఆర్సీ ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చార్జీల పెంపు భారాన్ని దాదాపు రూ.1,400 కోట్లకు తగ్గించినట్టు సమాచారం.

ఈ కొత్త టారిఫ్ ప్రతిపాదనలపై ప్రభుత్వం తీవ్రంగా తర్జనభర్జన పడుతోంది. ట్రాన్స్‌కో, డిస్కంల సీఎండీలు డి.ప్రభాకర్‌రావు, జి.రఘుమారెడ్డిలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించి టారిఫ్‌పై చర్చించినట్టు తెలిసింది. టారిఫ్‌లో కొన్ని మార్పుచేర్పులు సూచించాలని ప్రభుత్వం భావిస్తోంది. మే 16న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నందున కరెంటు చార్జీల పెంపును అప్పటిదాకా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

డిస్కంలు నిబంధనల మేరకు గత నవంబర్‌లోపే చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తే ఈ నెల 1 నుంచే పెంపు అమల్లోకి వచ్చేది. కానీ వరుసగా వరంగల్ లోక్‌సభ, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పురపాలికల ఎన్నికలు రావడంతో డిస్కంలు తమ ప్రతిపాదనలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. ఎన్నికల ఫలితాలపై చార్జీల పెంపు ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వరుసగా వాయిదాలను కోరగా ఈఆర్సీ కూడా అంగీకరించింది. పై ఎన్నికలు ముగిశాక మార్చిలో డిస్కంలు రూ.1,958 కోట్ల మేరకు చార్జీల పెంపును ప్రతిపాదించాయి.

ఈ నెల 23న కొత్త టారీఫ్‌ను ఈఆర్సీ ప్రకటిస్తుందని, మే 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని భావించాయి. కానీ పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో చార్జీల పెంపుపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆ ఎన్నిక ముగిశాక మే మూడో వారంలో ఈఆర్సీ నుంచి కొత్త టారిఫ్ ఉత్తర్వులు వస్తాయని, జూన్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement