నుమాయిష్.. లేడీస్ స్పెషల్
= మహిళలతో కిక్కిరిసిన ఎగ్జిబిషన్
= సందర్శించిన కేసీఆర్ సతీమణి, కుటుంబ సభ్యులు
= అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గన్‌ఫౌండ్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం నుమాయిష్‌లో ప్రత్యేకంగా మహిళలకే ప్రవేశం కల్పించి మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కె.శోభ, మనవడు, మనవరాలు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఎగ్జిబిషన్‌ను సందర్శించి సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
ఇక ఆడ శిశువుల సంరక్షణకు విస్తృత ప్రచార, అవగాహన కార్యక్రమాలు కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేసినట్లు ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. ఎగ్జిబిషన్‌లో ఆరోగ్య ప్రదర్శన శాల స్టాల్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు ఆడపిల్లల సంరక్షణకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వై.లలితకుమారి, డిప్యూటీ డైరెక్టర్ నరహరి, అధికారులు జూపల్లి రాజేందర్, రామాంజనేయులు, మన్మథమ్మ, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జైళ్ల శాఖ స్టాల్ ప్రారంభం..
నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ స్టాల్‌ను జైళ్ల శాఖ డీజీ వి.కె.సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఐజీ నర్సింహారావు, చర్లపల్లి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, చంచల్‌గూడ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్యామార్గం, వైస్ ప్రెసిడెంట్ బి.రాంచందర్‌రావు, సభ్యులు సుఖేష్‌రెడ్డి తదితరులు పోలీస్ సంక్షేమనిధికై రూ.10,52,500 చెక్కును సీపీకి అందచేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.