మటన్ బిర్యానీ.. కొర్రమీను వేపుడు..
నోరూరించిన వంటకాలు
- 26 రకాల పసందైన వెరైటీలు
- 150 మంది వంటగాళ్లు.. 350 మంది వలంటీర్లు
సాక్షి, హైదరాబాద్: మటన్ దమ్‌కా బిర్యానీ... దమ్‌కా చికెన్ ఫ్రై.. గుడ్డు పులుసు.. మిర్చీకా సాలన్.. కొర్రమీను వేపుడు.. రొయ్యల ఫ్రై.. ఇలా ఘుమఘుమలాడే వంటకాలెన్నో ప్లీనరీలో నోరూరించాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలంగాణ వంటకాలను ఆరగించి అదుర్స్ అని మెచ్చుకున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో 26 రకాల ప్రత్యేక వంటకాలతో సుమారు 15–20 వేల మంది ప్రతినిధుల ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ వంటకాల తయారీకి సుమారు రూ.20 లక్షలు ఖర్చయినట్లు అంచనా. మెనూలో ఉన్న ప్రత్యేక వంటకాలను నల్లకుంట ప్రాంతానికి చెందిన స్పందన క్యాటరర్స్ యజమాని పి.రమేశ్ నేతృత్వంలో సిద్ధం చేశారు. వంటకాల తయారీలో 150 మంది పాల్గొన్నారు. అతిథులకు కొసరి కొసరి వడ్డించేందుకు 350 మంది వలంటీర్లను అందుబాటులో ఉంచారు. వీరంతా గురువారం రాత్రి నుంచే వంటకాల తయారీలో నిమగ్నమయ్యారు.
ఇదీ మెనూ..
2,500 కిలోల మటన్‌తో దమ్‌కా బిర్యానీ తయారుచేశారు. 3000 కిలోల చికెన్‌తో దమ్‌కా బిర్యానీ సిద్ధం చేశారు. 15 వేల గుడ్లతో గుడ్డుపులుసు, 200 కిలోల చేపలు, 200 కిలోల రొయ్యల వేపుడు సిద్ధం చేశారు. 700 కిలోల మాంసంతో మటన్ కర్రీ చేశారు. మటన్ దాల్చాకు 300 కిలోల మాంసాన్ని వినియోగించారు. 200 లీటర్ల పాలతో పైనాపిల్ ఫిర్నీ స్వీట్ తయారు చేశారు. ఫ్లమ్ కేక్ ఐస్‌క్రీమ్ అతిథుల నోరూరించింది. శాకాహారుల కోసం మిర్చీకా సాలన్, ఆలుగోబీ టమాటా కుర్మా, గంగవాయిలి కూర పప్పు, వెజ్ దాల్చ, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, పెరుగు, దోసకాయ చట్నీ, ఫ్రూట్ సలాడ్, ఐస్‌క్రీం వడ్డించారు.