
మూడేళ్లలో రూ.15,000 కోట్లు కావాలి
రాజధాని అమరావతి అభివృద్ధికి తొలిదశలో మూడేళ్లలో(2018 నాటికి) రూ.15 వేల కోట్లు అవసరమవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అంచనాలను రూపొందించింది.
♦ రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధులపై సీఆర్‌డీఏ అంచనాలు
♦ రూ.7,500 కోట్ల రుణమిచ్చేందుకు హడ్కో అంగీకారం
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి అభివృద్ధికి తొలిదశలో మూడేళ్లలో(2018 నాటికి) రూ.15 వేల కోట్లు అవసరమవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అంచనాలను రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లు మినహా మిగతా నిధుల్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా హడ్కో రూ.7,500 కోట్లను మూడేళ్ల వ్యవధిలో రుణంగా ఇచ్చేందుకు నిబంధనలతో అంగీకరించినట్లు సీఆర్‌డీఏ తెలిపింది. ఇందుకు సంబంధించి సీఆర్‌డీఏ-హడ్కో మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరిందని, రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపితే రుణం తీసుకుంటామని పేర్కొంది.
అయితే ఈ రుణమిచ్చేందుకుగాను రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీగానీ లేదా మంజూరుచేసే రుణానికి 125 శాతం విలువగల సీఆర్‌డీఏ ఆస్తుల్ని తనఖా పెట్టాలనే నిబంధనను హడ్కో విధించింది. నీటిసరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యర్థాల నిర్వహణ, సిటీ రహదారులు, సాంఘిక మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకిచ్చే రుణానికి 10.15 శాతం వడ్డీ చెల్లించాలని హడ్కో స్పష్టం చేసింది. అలాగే రాజధానిలో పేదల గృహనిర్మాణాలకు మంజూరు చేసే రుణానికి 8.65 శాతం, ఎల్‌ఐజీ గృహనిర్మాణాలకు 9.15 శాతం, ప్రభుత్వ ఏజెన్సీల గృహాలకు మంజూరు చేసే రుణానికి 10.15 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని నిబంధన విధించింది. విద్యుత్ ప్రాజెక్టులకు మంజూరుచేసే రుణానికి 11.75 శాతం వడ్డీ చెల్లించాలని పేర్కొంది. రుణం తిరిగి చెల్లింపు కాలపరిమితి 20 సంవత్సరాలుగా తెలిపింది.
ప్రపంచ బ్యాంక్, ఇతర విదేశీ ఆర్థిక సంస్థలకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలి
ఇదిలా ఉండగా రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా సీఆర్‌డీఏ ప్రపంచబ్యాంక్‌తోపాటు జపాన్ అంతర్జాతీయ కో-ఆపరేషన్ ఏజెన్సీ, జాతీయ అభివృద్ధి బ్యాంకుల్నీ సంప్రదించింది. ప్రపంచబ్యాంక్ నుంచి రూ.6,500 కోట్ల రుణం తీసుకోవాలని ప్రతిపాదించింది. ఇందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలు అంగీకరించవని, అయినా ఇందుకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ తెలిపింది. అలాగే ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, రిలయన్స్ తదితర 15 ఫండ్ మేనేజర్లతోనూ రుణంకోసం సంప్రదింపులు జరిపింది. అయితే ఇవి సీఆర్‌డీఏకు నేరుగా రుణమివ్వడానికి అంగీకరించలేదు.
రాష్ర్ట అభివృద్ధి రుణం కింద రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీ ఇస్తేనే రుణం మంజూరు చేస్తామని స్పష్టం చేశాయి. అయితే ఇలా రాష్ట్రప్రభుత్వం రుణం తీసుకోవడానికీ ఎఫ్‌ఆర్‌బీఏం నిబంధనలు అంగీకరించబోవని సీఆర్‌డీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో రాజధాని తొలిదశ అభివృద్ధికి అవసరమైన నిధుల్ని హడ్కో నుంచి రుణంగా సమీకరించాలని నిర్ణయించినట్లు సీఆర్‌డీఏ రాష్ట్రప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.