హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల నిమిత్తం నగరంలో 220 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. నీట మునిగిన కాలనీలు, బస్తీల్లో భోజన వసతి ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు.
పైప్లైన్ పగలడం వల్లే ఎన్టీఆర్ మార్గ్లో రోడ్డుపై గుంత ఏర్పడినట్లు ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా మ్యాన్హోల్స్ను ఎవరూ తెరవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామన్నారు. అలాగే పురాతన భవనాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.