పంట వేస్తేనే ప్రభుత్వ ‘సాయం’!
- లేకుంటే తర్వాతి సీజన్‌కు రైతుకు ఆర్థిక సాయం అందదు
- పెట్టుబడి పథకం మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ మేధోమథనం
- ఖాళీగా ఉంచి ఎకరానికి రూ.4 వేలు తీసుకుంటామంటే కుదరదు
- వచ్చే ఏడాది నుంచి మొత్తం వ్యవసాయ భూమిని సాగులోకి తేవడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: తమ వ్యవసాయ భూమిలో పంట వేసే రైతులకే పెట్టుబడి పథకం కింద సాయం అందించాలని సర్కారు యోచిస్తోంది. పంట వేయని రైతులకు ఆర్థిక సాయం చేయడం వల్ల ఆ పథకం స్ఫూర్తి దెబ్బతింటుందని భావిస్తోంది. 2018 ఖరీఫ్ సీజన్ నుంచి ఎరువులు, విత్తనాలు, ఇతర పెట్టుబడుల కోసం ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. యాసంగి సీజన్‌లోనూ రూ.4 వేలు ఇస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో వ్యవ సాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఉన్నతస్థాయిలో మేధో మధనం జరుపుతోంది. నీటి వసతి లేకపోవడం.. తదితర కారణాలతో కొందరు రైతులు తమ భూములను బీడ్లుగా వదిలేస్తున్నారు.
కొందరు సాగు వదిలేసి వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూమి ఉంటే చాలు ఎకరానికి రూ.4 వేలు చొప్పున పెట్టుబడి పథకం వర్తిస్తుందా, లేదా అనే అంశంపై రైతుల్లో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో రైతు ఏదో ఒక పంట వేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెట్టుబడి పథకం ప్రారంభించే వచ్చే వర్షాకాల సీజన్‌లో భూమి ఉన్న ప్రతీ రైతుకు ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు సాయం చేయనుంది. అనంతరం ఎవరెవరు సాగు చేశారు, ఎవరు చేయలేదో ఏఈవోలతో సర్వే చేయిస్తుంది. వర్షాకాలంలో పెట్టుబడి సాయం పొంది తమ భూమిని సాగులోకి తీసుకురాలేదంటే.. తర్వాత యాసంగిలో సాగు చేసినా వారికి ఆర్థిక సాయం అందదు.
1.55 కోట్ల ఎకరాల భూమి..
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 55.53 లక్షల మంది రైతులున్నారు. అందులో సన్నచిన్నకారు రైతులు 47.68 లక్షల మంది, మధ్యతరహా రైతులు 7.09 లక్షల మంది, ధనిక రైతులు 16 వేల మంది ఉన్నారు. వారికి 1.55 కోట్ల ఎకరాల భూమి ఉంది. అయితే రాష్ట్రంలో వర్షాకాల సీజన్‌లో 1.08 కోట్ల ఎకరాలు, యాసంగిలో 37.62 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 1.46 కోట్ల ఎకరాలు సాగవుతుంది. వానాకాలంలో పంట కోతలు పూర్తయితే అదే భూమిలో యాసంగి పంటలూ వేస్తారు.
పత్తి, మిరప వంటి కొన్ని పంటలు మాత్రం యాసంగిలోనూ కొనసాగుతాయి. అంటే సీజన్ మొత్తానికి గరిష్టంగా 1.25 కోట్ల ఎకరాల భూమి మాత్రమే సాగవుతున్నట్లు లెక్క. కొంత భూమిలో ఉద్యాన పంటలు సాగవుతాయి. అలాగే మరో 10 లక్షల ఎకరాలకుపైగా భూమి సాగు కావడంలేదని వ్యవసాయ అధికారులు విశ్లేషిస్తున్నారు. సీజన్ బాగోలేకుంటే ఒక్కోసారి 30 లక్షల ఎకరాల వరకు సాగు జరగదు. ఈ నేపథ్యంలో పెట్టుబడి పథకం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందనేది అధికారుల భావన. ఒకవేళ భవిష్యత్తులో సాగునీటి వసతి ఏర్పడితే అప్పుడు సాగు పెరగవచ్చు. ఈ నేపథ్యంలో భూమి సాగు చేస్తేనే సాయం అనే నిబంధన తప్పనిసరిగా ఉంచాలని అంటున్నారు.
ఏదో ఒక పంట తప్పనిసరి..
ఇప్పటివరకు బీడుగా వదిలేసిన భూమిలో కనీసం గడ్డి మొక్కలైనా లేదా పండ్ల తోటలైనా వేస్తేనే అధికారులు పరి గణనలోకి తీసుకుంటారు. దీనివల్ల ప్రభు త్వం రాయితీతో ఇచ్చే 84 లక్షల గొర్రెలకైనా ఆహారం లభ్యంకానుంది. అలాగే పర్యావర ణానికి మేలు జరుగుతుందనేది సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు ఒక్కో సారి సరైన వర్షాలు లేక విత్తనాలు వేసినా మొలకెత్తవు. అప్పుడు పంట వేసిన ఆనవాళ్లు కూడా ఉండవు. అలాంటి సంద ర్భాల్లో తదుపరి సీజన్‌కు రైతుకు ఆర్థిక సాయం అందుతుందా, లేదా అనే అనుమా నాలున్నాయి. ఏదేమైనా మార్గదర్శకాలు ఖరారయ్యాకే స్పష్టత రానుంది. ఇటీవల రైతు సమగ్ర సర్వే ప్రకారం కేవలం 46.17 లక్షల మంది రైతులు మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.