గ్రేటర్‌లో ‘విదేశీ మద్యం దుకాణాలు’
♦ విదేశీ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా
♦ విదేశీ మద్యం దుకాణాలు
♦ ఔట్‌లెట్లలో 401 బ్రాండ్ల విదేశీ మద్యం..
♦ సిద్ధంగా ఉన్న 18 మంది దిగుమతిదారులు
♦ సర్కార్‌కు ఎక్సైజ్ కమిషనర్ లేఖ.. సీఎం సుముఖత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకులతో పాటు ఉన్నతాదాయ వర్గాలు లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విదేశీ మద్యం దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘ఎలైట్ ఔట్‌లెట్స్’ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాల్లో సుమారు 400కు పైగా విదేశీ స్కాచ్, విస్కీ, వైన్, బీరు ఇతర మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఈ మద్యం దుకాణాల్లో విదేశాల్లో తయారైన మద్యం మాత్రమే అందుబాటులో ఉంచాలని, దేశీయ తయారీ మద్యం(ఐఎంఎల్)కు చోటివ్వకూడదని ఎక్సైజ్ అధికారుల ప్రాథమిక ఆలోచన. ఈ ఎలైట్ ఔట్‌లైట్స్‌కు వచ్చే స్పందనను బట్టి అవసరమైతే 50 శాతానికిపైగా విదేశీ మద్యం, ప్రీమియం, మీడియం ఐఎంఎల్ విక్రయాలు జరుపుకునే అవకాశం కూడా ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్ పలు ప్రతిపాదనలతో ఏప్రిల్ 28న ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర పరిశ్రమల విధానం, టూరిజం అభివృద్ధి అంశాలకు విదేశీ మద్యం ముడిపడి ఉన్నట్లు గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన నేపథ్యంలో కమిషనర్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడమే తరువాయి. అదే జరిగితే జూలై నుంచి విదేశీ మద్యం దుకాణాలు ‘ఎలైట్ ఔట్‌లెట్స్’ పేరుతో ఏర్పాటవుతాయని భావిస్తున్నారు.
గ్రేటర్‌లోనే భారీగా ఏర్పాటు..
రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలకుగానూ హైదరాబాద్‌లోనే 503 ఉన్నాయి. వీటిలో 73 దుకాణాలను గత అక్టోబర్‌లో వేలం సందర్భంగా ఎవరూ తీసుకోలేదు. తద్వారా గ్రేటర్‌లోని ఒక్కో దుకాణం లెసైన్స్ ఫీజు రూ. 1.08 కోట్ల లెక్కన సుమారు రూ.75 కోట్లు ప్రభుత్వం నష్టపోయింది. ఈ నేపథ్యంలో ‘ఎలైట్ ఔట్‌లెట్స్’ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై మెట్రో నగరాల తరహాలో విదేశీ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. గ్రేటర్‌లో ఎవరూ తీసుకోని 73 మద్యం దుకాణాల స్థానంలోనే విదేశీ ఔట్‌లెట్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
రూ.1.25 కోట్ల లెసైన్స్ ఫీజు.. 10 వేల అడుగుల దుకాణం
ప్రతిపాదిత ఎలైట్ ఔట్‌లెట్లకు వార్షిక లెసైన్సు ఫీజును రూ.1.25 కోట్లుగా నిర్ణయించాలని సర్కార్‌కు రాసిన లేఖలో కమిషనర్ చంద్రవదన్ పేర్కొన్నారు. 10 వేల అడుగుల విశాలమైన ఏసీ దుకాణం, లక్ష రూపాయల దరఖాస్తు రుసుము తప్పనిసరి చేయనున్నారు. ఈ దుకాణాల్లో దేశీయ మద్యం విక్రయాలు జరుపుకునే అవకాశం కల్పించినా, సి-కేటగిరీ మద్యం, బీర్లు, వైన్ వంటివాటిని మాత్రం విక్రయించకూడదని ప్రతిపాదించారు. కాగా, 18 మంది దిగుమతిదారులు 401 బ్రాండ్ల విదేశీ మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వానికి తెలిపారు. ప్రస్తుతం విదేశీ మద్యం లభిస్తున్న బార్లు, మద్యం దుకాణాల్లో సైతం యథాతథంగానే అందుబాటులో ఉంటుందని కమిషనర్ చంద్రవదన్ తెలిపారు.