అందరూ ఉన్నా అనాథలా...
హైదరాబాద్: పెదనాన్న డిప్యూటీ కలెక్టర్, మేనమామ అడ్వకేట్ అయినా ఆమెను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అను భవిస్తున్నా ఆమెను ఆదుకున్నవారే లేరు. నరక కూపం నుంచి బయటిపడినా ఆమెను అక్కున చేర్చకునే వారు లేక ఆ అభాగ్యురాలు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. ఆమె విషాదగాధ ఉన్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది.
సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అనుభవించి కోలుకున్న ప్రత్యూష భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగిస్తోందని హైకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పథకం 'బేటీ బచావో బేటీ పడావో' ఆమెకు వర్తించేలా చూడాలని అధికారులను కోర్టు ఆదేశించింది. పిన్ని చాముండేశ్వరి ముఖం చేసేందుకు ప్రత్యూష ఏమాత్రం ఇష్టపపడడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంతజరిగినా పశ్చాత్తాపం లేకపోవడంతో చాముండేశ్వరి తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
డిశ్చార్జి అనంతరం ప్రత్యూషను చీఫ్ జస్టిస్ ఛాంబర్ లో హాజరుపరచాలని సూచించింది. ప్రత్యూష తండ్రి రమేశ్, మేనమామ అయిన న్యాయవాది సాయిప్రతాప్ ను సోమవారం తమ ఎదుట హాజరుపరచాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యూష పెదనాన్న సతీశ్ చంద్ర శుక్రవారం హైకోర్టులో హాజరయ్యారు. ప్రత్యూష కుటుంబ సభ్యులు, ఆస్తుల వివరాలను ఆయనను అడిగి న్యాయస్థానం తెలుసుకుంది.