
'టీడీపీ ప్రభుత్వం బోనులో నిలబడింది'
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ అన్నారు.
సోమవారం ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడుతూ... రోజాను అసెంబ్లీలోని అనుమతిస్తే ప్రభుత్వానికి హుందాగా ఉండేదని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి తీర్పు ఎందుకు అమలు చేయలేదో న్యాయస్థానానికి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ఎందుకు బేఖాతరు చేస్తుందో వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. చట్టాలకు పాలకులే విలువ ఇవ్వకపోతే సామాన్యులు ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
కోర్టు ఆదేశాలను పాటించకుండా టీడీపీ తప్పుమీద తప్పు చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించకపోవడంతో టీడీపీ ప్రభుత్వం బోనులో నిలబడి ఉందని లాయర్ అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.