
అప్పుడే ‘కట్’కట
బండ్లగూడ, మౌలాలి, ఇబ్రహీంపట్నం 132 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 2, మధ్నాహ్నం 2 గంటల చొప్పున కోతలు..ఇదీ నగరంలో గురువారం విద్యుత్ సరఫరా తీరు.
- విద్యుత్ కోతలు షురూ
- చెప్పాపెట్టకుండా సరఫరా నిలిపివేత
- శివార్లలో పరిస్థితి మరీ ఘోరం
- చిన్నాచితకా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2- 4 గంటల మధ్య కరెంట్ లేదు..
ఎస్‌ఆర్‌నగర్‌లో మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 వరకు సరఫరా నిల్..
గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ జోన్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ..
బండ్లగూడ, మౌలాలి, ఇబ్రహీంపట్నం 132 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 2, మధ్నాహ్నం 2 గంటల చొప్పున కోతలు..ఇదీ నగరంలో గురువారం విద్యుత్ సరఫరా తీరు. వేసవికి ముందే నగరవాసి చెమటలు కక్కుతున్నాడు. చలి తీవ్రత తగ్గి పగటి వేళ కొద్దిగా ఉక్కపోస్తుండగా.. తలవని తలంపుగా విద్యుత్ కోతలూ షురూ అయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం కాలేజీలు, ఇనిస్టిట్యూట్లలో కంప్యూటర్లు పనిచేయక వృత్తివిద్య కోర్సుల విద్యార్థులు అవస్థల పాలవుతున్నారు. జిరాక్స్ మిషన్లు, ఫొటో స్టూడియోలు, సెలూన్లు, జ్యూస్ బండ్ల యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారు. నీటి సరఫరాపైనా ప్రభావం చూపుతోంది.
కోతలు ఇందుకేనట!
షాపూర్‌నగర్, చాంద్రాయణగుట్ట, మౌలాలి, శివరాంపల్లి 220 కేవీ సబ్‌స్టేషన్ల నుంచి ఎర్రగడ్డ, చిలకలగూడ, గన్‌రాక్, జూబ్లీహిల్స్ , హుస్సేన్‌సాగర్, ఇమ్లీబన్, బండ్లగూడ, మాదాపూర్, ఆసిఫ్‌నగర్, ఐడీపీఎల్, చింతల్ 132 కేవీ సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఇక్కడి నుంచి 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతోంది
ఒక్కో 33/11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో పది నుంచి పన్నెండు 11 కేవీ ఫీడర్లు ఉంటాయి
గ్రేటర్‌లో సరఫరా- డిమాండ్ మధ్య 200 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని నివారించేందుకు ఒక్కో సబ్‌స్టేషన్ పరిధిలో 2 నుంచి 4 గంటల పాటు సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్‌కో ఆదేశాలిచ్చింది.
రామంతాపూర్‌లోనరకయాతన
రామంతాపూర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ ఉండట్లేదు. రోజువారీ పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. అధికారిక కోతలిలా ఉంటే, నెలలో రెండుమూడు సార్లు ఫీడర్ల మరమ్మతులు, చెట్ల నరికివేత వంటి పనుల పేరుతో సరఫరా నిలిపివేస్తున్నారు. ఒక్కోసారి అర్ధరాత్రి పూట కరెంట్ పోతోంది. ఫోన్‌చేసినా కనీస స్పందన ఉండట్లేదు.
పేపర్‌ప్లేట్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
రోజు మొత్తానికి 4 గంటలు మాత్రమే కరెంటు ఉంటోంది. దీంతో ఉత్పత్తి తగ్గుతుంది. రోజుకు 3 లక్షల వరకు పేపర్ ప్లేట్స్ తయారీ లక్ష్యం. ప్రస్తుతం లక్ష మాత్రమే తయారవుతున్నాయి. 8 గంటలు పనిచేయాల్సిన కార్మికులు 4 గంటలే పనిచేస్తుడంటంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. అమ్మకాలు తగ్గుతున్నాయి.
- కిరణ్‌కుమార్,ఎంసీ మ్యాన్‌క్రాప్ట్స్, మన్సూరాబాద్
కోతల్లేవంటూనే వాతలు
కాటేదాన్ పారిశ్రామికవాడలో ప్రస్తుతం అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. పరిశ్రమలు నడవక యజమానులు, పని దొరక్క కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం కోతలు లేవంటూనే వాతలు పెడుతున్నారు.
- మాణిక్, కార్మికుడు, బాబుల్‌రెడ్డినగర్
ఎలా బతకాలి?
లక్షలాది రూపాయల విద్యుత్ చార్జీలను చెల్లిస్తున్నా అధికారులు పరిశ్రమలకు కోతలు విధిస్తున్నారు. దీంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. పరిశ్రమలే జీవనాధారమైన మాకు విద్యుత్ కోతలు యమగండంగా మారాయి.
- కమల్‌కుమార్ అగర్వాల్, పరిశ్రమ నిర్వాహకుడు