మనం ఎక్కాల్సిన మెట్రో ఇంకెంత లేటు! | Hyderabad Metro project faces delay | Sakshi
Sakshi News home page

మనం ఎక్కాల్సిన మెట్రో ఇంకెంత లేటు!

Published Mon, Oct 24 2016 1:21 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

మనం ఎక్కాల్సిన మెట్రో ఇంకెంత లేటు! - Sakshi

మనం ఎక్కాల్సిన మెట్రో ఇంకెంత లేటు!

మెట్రో రైలు.. హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలను కొంత మేర అయినా తీర్చడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.

మెట్రో రైలు తొలిదశ ప్రారంభంపై వీడని సందిగ్ధం
మియాపూర్-ఎస్‌ఆర్ నగర్, నాగోల్-మెట్టుగూడ రూట్లు సిద్ధం
వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించని ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వం
వాణిజ్య స్థలాల అభివృద్ధిపై నిర్మాణ సంస్థ అంచనాలు తల్లకిందులు
రూ. 3 వేల కోట్ల కోసం పట్టుబడుతున్న నిర్మాణ సంస్థ..?
ఎంజీబీఎస్-ఫలక్‌నుమా అలైన్‌మెంట్‌పై కొరవడిన స్పష్టత

 
సాక్షి, హైదరాబాద్
మెట్రో రైలు.. హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలను కొంత మేర అయినా తీర్చడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అయితే భాగ్యనగరంలో మెట్రో రైలు ఎప్పుడు పరుగులు పెడుతుంది..? మెట్రోలో ప్రయాణించాలనే నగరవాసుల కల ఎప్పుడు తీరుతుంది..? అనే విషయాలు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. మెట్రో తొలి దశ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్‌ఆర్ నగర్ రూట్లలో 20 కి.మీ. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే విషయంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ, ప్రభుత్వ వర్గాలు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాగోల్-రహేజా ఐటీ పార్క్, జేబీఎస్- ఫలక్‌నుమా, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో మొత్తం 72 కి.మీ. మార్గాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది.

వాస్తవానికి ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన గడువు జూన్ 2017 నుంచి 2018 డిసెంబర్ వరకు పెరగడంతో తొలుత అనుకున్న అంచనా వ్యయం రూ.14 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లకు చేరుకుంది. దీంతో సంస్థపై రూ.3 వేల కోట్ల అదనపు భారం పడుతోందని.. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తమకు చెల్లించాలని నిర్మాణ సంస్థ పట్టుబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే నిర్మాణ సంస్థ అడిగిన మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటున్నట్లు సమాచారం. మరోవైపు ఎంజీబీఎస్-ఫలక్‌నుమా(5.3 కి.మీ) మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ మార్గంలో పనులు మొదలు కాకపోవడం గమనార్హం.
 
ప్రస్తుత పురోగతి ఇదీ..
మొత్తం మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మార్గంలో 2,748 పిల్లర్లకుగాను ఇప్పటివరకు 2,200 పిల్లర్ల ఏర్పాటు పూర్తరుు్యంది. 49 కి.మీ. మార్గంలో పిల్లర్లపై మెట్రో రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా పట్టాలను ఏర్పాటు చేశారు. మూడు కారిడార్లలో పరుగులు పెట్టేందుకు 57 మెట్రో రైళ్లు ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటికి 18 రకాల సామర్థ్య పరీక్షలను ఫ్రాన్‌‌సకు చెందిన కియోలిస్ సంస్థ పూర్తిచేసింది. కాగా, నాగోల్-మెట్టుగూడా మార్గంలో స్టేషన్లు పూర్తిస్థాయిలో సిద్ధంకాగా.. మియాపూర్-ఎస్‌ఆర్ నగర్(12 కి.మీ.) మార్గంలో స్టేషన్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం మలక్‌పేట్, ఆలుగడ్డబావి, ఒలిఫెంటాబ్రిడ్జి, మెట్టుగూడా ప్రాంతాల్లో దక్షిణ మధ్య రైల్వే పట్టాలపై నుంచి మెట్రో రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
 
అంచనాలు తల్లకిందులు
ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో 269 ఎకరాల విలువైన స్థలాలను 45 ఏళ్లపాటు నిర్మాణ సంస్థకు లీజుకిచ్చింది. లీజు గడువును మరో 20 ఏళ్లపాటు పొడిగించుకునే వెసులుబాటునూ కల్పించింది. ఈ స్థలాల్లో 18 చోట్ల బడా మాల్స్ నిర్మించి రియల్ ఎస్టేట్, వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాజెక్టుకు చేసిన వ్యయంలో 55 శాతం నిధులు రాబట్టుకోవచ్చని.. మరో 40 శాతం ప్రయాణీకుల చార్జీల ద్వారా, మరో 5 శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావించింది. కానీ, ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌లో అంతగా వృద్ధి లేనందున మూసారాంబాగ్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీల్లో మాత్రమే మెట్రోమాల్స్ నిర్మిస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ వరా్గాలు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, నగరంలో ఏర్పాటుకానున్న 65 మెట్రో స్టేషన్లలో వాణిజ్య స్థలాలకు చదరపు అడుగుకు ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.150 నుంచి రూ.550 వరకు అద్దెలు వసూలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. ఈ స్థలాలకు కూడా అశించిన స్థాయిలో స్పందన లేనట్టు సమాచారం. ఇప్పటివరకు స్టేషన్లలో 70 శాతం మేర రిటైల్ స్పేస్‌ను అద్దెకిచ్చినట్లు తెలిసింది.
 
మెట్రో రైలు స్వరూపం ఇదీ..
• 2011 ఫిబ్రవరిలో ప్రారంభం
• 2015 మార్చి- నాగోల్-మెట్టుగూడా రూట్(8 కి.మీ.)ను వాస్తవానికి ప్రారంభించాలనుకున్న సమయం
• 2017 జూన్‌కు పూర్తి కావాలి
• 2018 డిసెంబర్ వరకూ పొడిగింపు
• మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మార్గం
• ఇప్పటి వరకూ పూర్తయిన మార్గం 49 కి.మీ.
• మొత్తం పిల్లర్లు 2,748
• నిర్మాణం పూర్తయిన పిల్లర్లు 2,200
• మొత్తం మెట్రో స్టేషన్లు 65
• ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 14,000 కోట్లు
• సవరించిన అంచనా వ్యయం రూ. 17,000 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement