తమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ!
ముక్కతోనే.. ముద్ద దిగుతోంది
► నాన్‌వెజ్ వినియోగంలో దేశంలో నగరమే నంబర్‌వన్
► మటన్, చికెన్, బీఫ్, చేపలు,
► రొయ్యలు అన్నింటికీ యమ డిమాండ్
► రోజూ 8.66 లక్షల కిలోల మాంసం అమ్మకాలు
► నెలకు సగటున తలసరి 2.6 కిలోల మాంసం లాగించేస్తున్న నగర వాసులు
► పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్ల సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తమకే ప్రత్యేకమైన బిర్యా నీతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్.. మాంసాహారం వినియోగంలో మన దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. మొఘ లాయి, దక్కన్, ఇరానీ, పర్షియన్ వంటకాలకు నెలవుగా మారిన నగరంలో మటన్, చికెన్, బీఫ్, చేపలు, రొయ్యలు వంటి మాంసాహార వినియోగం బాగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 31 కిలోలు వినియోగిస్తున్నట్లు తేలింది. పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్లు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ప్రధానంగా బిర్యానీతో..
కుతుబ్‌షాహీలతో హైదరాబాద్ గడప తొక్కిన బిర్యానీ ఇప్పుడు ప్రపంచంలోని 80శాతం దేశాల్లో నాన్‌వెజ్ కేటగిరీల్లో ప్రధాన వంటకంగా మారింది. హైదరాబాద్ లో బిర్యానీ కోసమే వెలిసిన హోటళ్లు, రెస్టా రెంట్లు ఎన్నో ఉన్నాయి. మటన్, చికెన్, బీఫ్‌ల తో పాటు ఫిష్ బిర్యానీ కూడా బాగా అమ్ముడ వుతోంది. దీనికితోడు ఇళ్లలో చికెన్ వినియోగం బాగా పెరగడంతో... నిత్యం మాంసాహార వినియోగం లక్షల కిలోలకు చేరుకుంది.
కోటి జనాభా.. నెలకు సగటున 2.6 కిలోల మాంసం రాజధాని గ్రేటర్ నగరం జనాభా సుమారు కోటికి చేరువైంది. నగరంలో రోజువారీగా చికెన్ వినియోగం 6.66 లక్షల కిలోలుగా ఉంది. మటన్, బీఫ్ అమ్మకాలు కలిపి సుమారు లక్ష కిలోల మేర, చేపల విక్రయాలు మరో లక్ష కిలోల మేర ఉంటాయి. అంటే మొత్తంగా రోజుకు 8.66 లక్షల కిలోల మేర మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన నెలకు 2,59,80,000 కిలోల మాంసం వినియోగమవుతోంది. అంటే సగటున ఒక్కొక్కరి మాంసం వినియోగం నెలకు 2.6 కిలోలుగా, ఏడాదికి 31 కిలోలుగా తేలింది. అదే దేశవ్యాప్తంగా సగటు మాంసం వినియోగం ఏడాదికి 5 కిలోలే కావడం గమనార్హం. అంటే దేశవ్యాప్త సగటు కంటే సుమారు 6 రెట్లు మాంసం వినియోగం అధికమన్న మాట.
చికెన్.. అదిరెన్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి లో నెలకు నాలుగు కోట్ల కిలోల మేర కోడి మాంసం ఉత్ప త్తవుతుండగా.. అందులో రెండు కోట్ల కిలోల మేర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వినియోగమవుతున్నట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. దేశంలో చికెన్ విని యోగంలో హైదరాబాద్ తర్వాత ముంబై రెండో స్థానంలో నిలిచినట్లు తేలింది.
చేపా.. చేపా.. నిన్నొదలా!
చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తులనూ గ్రేటర్ వాసులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. కొవ్వుశాతం తక్కువగా ఉండడం, శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయన్న వైద్యుల సూచనల మేరకు చేపల విని యోగం పెరుగుతోంది. వీటితోపాటు రొయ్యలు, పీతలు, ఇతర సముద్ర ఉత్పత్తులకూ డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా నగరం పరిధిలో రోజూ సుమారు లక్ష కిలోల మేర చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయని మత్స్యశాఖ అంచనా వేసింది.
మటన్‌కూ ఫుల్ గిరాకీ
హైదరాబాద్‌లో ఇటీవల చికెన్ వినియోగం బాగా పెరిగినా.. మటన్‌కు మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఇళ్లలో వినియోగానికితోడు హోటళ్లు, రెస్టారెంట్లలో మటన్ కబాబ్‌లు, పత్తర్‌కా ఘోష్, బోటి, పాయా, లివర్‌ఫ్రై, బిర్యానీ తదితర వంటకాలు విస్తృతంగా విక్రయమవుతున్నాయి. పాత నగరం సహా పలు ప్రాంతాల్లో బీఫ్ వినియోగం కూడా అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ సగటున సుమారు లక్ష కిలోల మేర మటన్, బీఫ్ అమ్మకాలు సాగుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.
అవగాహన పెరగడమే కారణం
‘‘ప్రొటీన్స్ అధికంగా ఉండడం, పోషకాహార లేమిని చికెన్ దూరం చేస్తుందన్న అవగాహన పెరగడంతో చికెన్, గుడ్ల వినియోగం ఎక్కువైంది. చికెన్, గుడ్లలో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి, కొవ్వు శాతం తక్కువే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చికెన్, గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టడం పౌల్ట్రీ రైతులకు భారంగా పరిణమించింది..’’ – రంజిత్‌రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
బిర్యానీతో పెరుగుతున్న డిమాండ్
‘‘వందల ఏళ్ల కిందటి నుంచే మాంసాహార వంటకాల్లో అనేక వెరైటీలు రుచి చూసిన చరిత్ర హైదరాబాదీలది. ఆ సంస్కృతిని కొనసాగిస్తూ మొఘలాయి, దక్కనీ మటన్, చికెన్ బిర్యానీ, పాయ, పత్తర్‌కా ఘోష్ వంటి అరుదైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీకి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది కూడా..’’ – ఎండీ రబ్బానీ, షాగౌస్ బిర్యానీ