![కూల్చివేసిన భవనం మళ్లీ నిర్మాణం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81499399219_625x300.jpg.webp?itok=WO8l9EKQ)
కూల్చివేసిన భవనం మళ్లీ నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: నిజాంపేటలోని సర్వే నంబర్ 52, 53, 54లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 20కి పైగా విల్లాల నిర్మాణం చేపట్టింది. దాదాపు ఇవి పూర్తికావచ్చాయి. వీటికి హెచ్‌ఎండీఏ నుంచి బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే అక్రమంగా సెల్లార్‌ను కూడా నిర్మించేశారు. గతేడాది డిసెంబర్‌లో ఈ అక్రమ నిర్మాణం విషయం హెచ్‌ఎండీఏ దృష్టికి రావడంతో పాక్షికంగా కూల్చివేసింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ నిర్మాణం ఆపేసి మళ్లీ మొదలెట్టారు. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు గత జూన్ 30వ తేదీన ఇది అక్రమ నిర్మాణమంటూ మరోసారి నోటీసు జారీ చేశారు.
ఈ ఒక్కటే కాదు...ఇటువంటి అక్రమ భవన నిర్మాణాలు నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొకొల్లుగా పుట్టుకొస్తున్నాయి. అనుమతుల్లేవు...అడ్డగోలుగా అంతస్తుల మీద అంతస్తులు కట్టేశారు...కట్టిస్తూనే ఉన్నారు. వారికి గ్రామ పంచాయతీ నోటీసులు పట్టవు...హెచ్‌ఎండీఏ నోటీసులను కూడా బేఖాతరు చేస్తారు. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఏకంగా నిబంధనలకే పాతరేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన నింజాంపేట భండారి లే అవుట్‌లో అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసినా అవి ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్మాణాన్ని సంతరించుకున్నాయి. హెచ్‌ఎండీఏ కమిషనర్ ఆ భవనాలను పూర్తిగా నేలమట్టం చేయాలని ఆదేశాలిచ్చినా అమలుకాలేదు. అక్రమ భవన నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
అన్నిచోట్లా నిబంధనలకు పాతరే..
గతేడాది నవంబర్‌లో వరద ముంపునకు గురైన నిజాంపేటలోని భండారి లే అవుట్‌లో 12 మీటర్లకు మించి (జీప్లస్ 2 కంటే ఎక్కువ) భవనాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి లేదు. అయితే అందుకు విరుద్ధంగా ఏకంగా ఆయకట్టు భూమిలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అయినా అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ వ్యవహారం నిజాంపేట బండారి లే అవుట్‌లో నిత్యకృత్యంగా మారింది. అయితే నిర్మాణ సమయంలో నిబంధనలనైనా పాటించారా అంటే అదీ లేదు. ఎక్కడా సెట్‌బ్యాక్‌ను పట్టించుకోవడం లేదు. 30 అడుగుల అప్రోచ్ రోడ్ల జాడే కనపడదు. కొందరు గ్రామ పంచాయతీ నుంచి జీ ప్లస్ అనుమతులు తీసుకొని...ఏకంగా ఐదు, ఆరు, ఏడు అంతస్తుల్ని నిర్మించేశారు.
ఇదంతా పక్కన పెడితే...తురక చెరువు ఆయకట్టు భూముల్లోనే వెలిసిన ఈ లే అవుట్‌కు ఎగువన ఉండే బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుంది. అది నిండగానే అక్కడి నుంచి కాలువ ద్వారా పాపయ్య కుంటకు వస్తుంది. బిల్డర్లు కాసుల కక్కుర్తితో నీటిని చేరవేసే ఆ కాలువనే పూడ్చి రోడ్లను నిర్మించారనే విషయం గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల పుణ్యామా అని వెలుగుచూసింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో హెచ్‌ఎండీఏ మొదలు పంచాయతీ, రెవెన్యూ ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టి అనుమతుల్లేని భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. దాదాపు 50 వరకు అక్రమ భవన నిర్మాణాలను పాక్షికంగా కూల్చేశారు. అయితే ఇప్పుడు ఆ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఒక్క భవన నిర్మాణమూ ఆగిపోలేదు.
వర్షం పడితే ముంపు తప్పదా...?
నిజాంపేట భండారీ లే అవుట్‌లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల వల్ల మరోసారి ముంపు తప్పదా అన్న భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. గతేడాది గుర్తించి పాక్షికంగానే కూల్చివేసిన భవనాలను మళ్లీ పూర్తిస్థాయిలో నిర్మిస్తుండడంతో వరద ముంపును ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం, పీకలమీదకు వచ్చాక నోటీసులు జారీ చేసి పాక్షికంగా కూల్చడం పరిపాటిగా మారిందని, పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఇక్కడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. ఈ విషయంలో జాప్యం జరగకుండా వెంటనే రంగంలోకి దిగాలని కోరుతున్నారు.
గతంలో పాక్షికంగా కూల్చివేసిన ఓ భవనం...