
'శ్రీమంతుడు' ఏం చేస్తాడు?
ప్రిన్స్ మహేశ్ బాబు 'శ్రీమంతుడు' సినిమా టీజర్ అభిమానులను అలరిస్తోంది.
హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు 'శ్రీమంతుడు' సినిమా టీజర్ అభిమానులను అలరిస్తోంది. ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులో డబ్బులన్నీ తీసి రంగులు, రోడ్లేసి వెళ్లిపోతమనుకున్నారా... నిన్ను, వీడ్నీ, వాడ్నీ.... వీళందర్నీ మొత్తాన్నీ దత్తత తీసుకున్నా అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్ చెప్పి మహేశ్ అదరగొట్టేశాడు. ఊరిని దత్తత తీసుకోవడం అనే అంశంపై ఆధారపడి శ్రీమంతుడు చిత్రం రూపొందుతుందని ఈ డైలాగ్తో తెలుస్తుంది. ఆ కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకునే మహేశ్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
అయితే మహేశ్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను దత్తత తీసుకుంటున్నారంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. మహేశ్ భార్య నమత్ర కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ఆ తర్వాత ఈ విషయంపై ఎలాంటి వార్తలు రాలేదు.
కాగా మహేశ్ ఈ చిత్రం ద్వారా బుర్రిపాలెంను దత్తత తీసుకుంటున్నారనే సందేశాన్ని ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 'మిర్చి'తో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. 'శ్రీమంతుడు' పాత్ర బాగా కనెక్ట్ కావడంతో మహేశ్ బాబు జీవించారని చిత్ర యూనిట్ చెబుతోంది.