- ఎరువులు, పురుగుమందులతో ప్రమాదకరమైన ఆయుధాలు
- బాంబులు, రసాయన ఆయుధాలు తయారు చేస్తున్న ఉగ్రవాదులు
- ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా దాడులు
- దేశంలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఎరువులు, పురుగు మందులు
- అవి దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు ప్రమాదమే!
- నియంత్రణ లేకపోవడంపై ఆందోళన.. అవగాహన కల్పించేందుకు చర్యలు
- దీనిపై హైదరాబాద్‌లో ఇండో–అమెరికా వర్క్‌షాప్
► అల్‌కాయిదా ఉగ్రవాదులు 2001 సెప్టెంబర్‌లో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీవో)పై విమానాలతో దాడి చేసి వేల మందిని పొట్టనపెట్టుకున్నారు. అయితే ఆ దాడికి ముందు వారేం చేశారో తెలుసా..? పంటలకు ఉపయోగించే పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి.. రద్దీగా ఉండే ప్రాంతంలో చల్లడం ద్వారా వేలాది మందిని చంపేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎందుకో అది వీలుగాక.. విమానాలతో దాడి చేశారు..
► 1995లో అమెరికాలోని ఓక్లహామాలో ఉగ్రవాదులు ఒక భవనంపై బాంబుదాడి చేసి 168 మందిని బలితీసుకున్నారు. ఆ బాంబును దేనితో తయారు చేశారో తెలుసా..? పంటలకు వినియోగించే ఎరువులు, పురుగుమందులు కలిపి రూపొందించారు..
... ఎరువులు, పురుగు మందులు పంటల రక్షణ కోసమే కాదు.. పెద్ద సంఖ్యలో మనుషులను బలితీసుకునే మారణ హోమాలకు ఆయుధాలుగా కూడా మారుతాయని ఈ రెండు ఘటనలు చెబుతాయి. ఉగ్రవాదులు ఎరువులు, పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి 1975 నుంచి 2002 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 146 భారీ విస్ఫోటనాలు సృష్టించారు. వేలాది మందిని బలి తీసుకున్నారు. దీంతో ఎరువులు, పురుగు మందుల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చ జరుగుతోంది. వ్యవసాయక దేశమైన భారత్‌లో ఎరువులు, పురుగుమందులను విçస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో... అవి దుష్టుల చేతిలో పడకుండా చర్యలు చేపట్టడంపై భారత్, అమెరికాలు దృష్టి సారించాయి. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో సదస్సు జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన ఇంధనశాఖ, స్టేట్ కెమికల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్, పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ (పీఎన్‌ఎన్‌ఎల్)ల∙శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
– సాక్షి, హైదరాబాద్
పురుగు మందులతో మారణ హోమమే
భారత్ వ్యవసాయక దేశం. దీంతో ఇక్కడ ఎరువులు, పురుగు మందుల వినియోగం విస్తృతంగా ఉంటుంది. ఇందులోనూ దేశవ్యాప్తంగా ఉపయోగించే వాటిలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 24% వరకు ఉండటం గమనార్హం. దీంతో ఇక్కడ అవి పక్కదారి పట్టడానికి అవకాశాలు ఎక్కువ. పైగా హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయి. ఉగ్ర వాదులు, మిలిటెంట్ ఉద్యమకారులు, క్రిమినల్‌ల చేతిలోకి ఎరువులు, పురుగుమందులు వెళితే అత్యంత ప్రమాదం. పురుగు మందుల సాంద్రత పెంచి ఇతరత్రా రసాయనాలు కలిపితే.. విధ్వంసకర ఆయుధాలుగా తయారవుతాయి. పురుగుమందులను అధిక సాంద్రతతో స్ప్రేచేస్తే విష ప్రభావంతో పెద్ద సంఖ్యలో జనం చనిపోయే ప్రమాదం ఉంటుంది.
ఎరువులతో బాంబులు
ఎరువులు, పురుగు మందులతో బాంబులు తయారు చేయడం సులువు, చవక కూడా.. నైపుణ్యం ఉన్న ఉగ్రవాదులు వాటిని ఉప యోగించి తక్కువ సమయంలోనే బాంబులు తయారు చేయగలరని ఇప్పటికే వెల్లడైంది. యూరియాకు నైట్రిక్ యాసిడ్ కలిపి భారీ పేలుడు సృష్టించే బాంబుగా తయారు చేయవచ్చని చెబుతున్నారు. అంటే మనం పెద్దగా పట్టించుకోని ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదు లు, క్రిమినల్స్ చేతిలో పడితే జరిగే నష్టం చాలా ఎక్కువ. దీంతో అమెరికా, భారత నిఘా వర్గాలు ఇప్పుడీ ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాయి.
పక్కదారి పట్టకుండా చూడాలి
‘‘ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదుల చేతిలో పడితే బాంబులు తయారు చేయడానికి ఆస్కార ముంది. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగు తోంది. పురుగు మందులు, ఎరువుల సరఫరా కట్టుదిట్టంగా ఉండాలి..’’
– డాక్టర్ జీవీఎం శర్మ, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐసీటీ, హైదరాబాద్
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటు చేయాలి..
‘‘పురుగు మందులు, ఎరువులు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకుండా జాగ్ర త్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను ఏర్పా టు చేయాలి. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. డీలర్లను, వ్యాపారులను చైతన్యం చేయాలి. తయారీ యూని ట్లన్నీ భద్రత నడుమ ఉండాలి. దేశంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 66 పురుగు మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రకటించి, నిషేధించారు. అందులో మన దేశంలో 18 పురుగు మందులపై నిషేధం ఉంది..’’
– పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి