'ఆ యాత్రకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు'
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు పర్యటనలకు తీసుకెళ్లాలన్న స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ యాత్రకు వెళ్లకూడదని తమ పార్టీ ఎమ్మెల్యేలంతా నిర్ణయించారని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర పరిస్థితులు బాలేదని చెబుతూనే ఇలా విహారయాత్రలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం 5 రోజుల్లో ముగించాలన్న నిర్ణయానికి తాము వ్యతిరేకమన్నారు. కనీసం 20 రోజులైన సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రజా సమస్యలపై ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజా సమస్యలపై తన వైఖరిని అసెంబ్లీలో వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.