మాటలతో మభ్యపెడుతున్నారు: నారా లోకేష్
మల్లాపూర్/ఏఎస్‌రావునగర్(హైదరాబాద్): అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఏఎస్‌రావునగర్‌లో రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గరికపాటి రాంమోహన్‌రావు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి, తూళ్ల వీరేందర్‌గౌడ్, ఎలిమినేటి సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీ నాయకులకు కండువాలు పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల ముందుకు వచ్చే ధైర్యం లేదన్నారు.
మంత్రి కేటీఆర్ ఎన్నికల సందర్భంగా కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వంద సీట్లు గెలుస్తామని బీరాలు పలికిన కేటీఆర్ ఇప్పుడు మేయర్ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంటామని మాట మార్చారన్నారు. నగరాన్ని అభివృద్ది చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలతో పాటు చారిత్రాత్మక ప్రదేశాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూల్చివేయాలని చూస్తుందన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని, హుస్సేన్‌సాగర్ బుద్దుడు, హైటెక్‌సిటీని నిర్మించిన తెలుగుదేశందేనన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యేలు తెలుగుదేశం, బీజేపీలకు చెందినవారేనని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జీహెచ్‌ఎంసీలో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకోని గ్రేటర్‌పై జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థులు కేవీఎల్‌ఎన్‌రావు (కాప్రా), తాతినేని సామ్రాజ్యం (ఏఎస్‌రావునగర్), బోదాసు లక్ష్మీనారాయణ (మల్లాపూర్)లతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ రాంచందర్‌గౌడ్, నాయకులు టీజీకె.మూర్తి, మన్నె సుబ్రహ్మణ్యం, ఘట్టమనేని విజయశ్రీనాథ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి.శరత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.