'మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలి'
హైదరాబాద్: మాదిగలది 50 ఏళ్ల ఆవేదన అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష మాదిగ అన్నారు. మాదిగల ఆకాంక్షలు నెరవేర్చాలని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల ధర్మయుద్ధం మహాసభలో ఆయన డిమాండ్ చేశారు. డబ్బులిస్తే మాదిగలు ఇక్కడకు రాలేదని, తమకు దోచుకున్న దాచుకున్న డబ్బుల్లేవన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసైనా ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష తెలిపారు.
భారత్ మాతాకీ జై అనగానే సరిపోదు..
మాదిగల పోరాటానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హామీఇచ్చారు. మాదిగలకు సమన్యాయం జరగాలన్నారు. మాదిగల పోరాటానికి రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. మాదిగాల ఎస్సీ వర్గీకరణ లక్ష్యం సిద్ధించాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ వాళ్లు సభకు రాకపోయినా నష్టం లేదన్నారు. భారత్ మాతాకీ జై అనగానే సరిపోదని, అందరూ అభివృద్ధి చెందినప్పుడే సమన్యాయం జరిగినట్టన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మేలు జరగాలని వెంకయ్యనాయుడు అన్నారు.
ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు నేతలు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మాదిగలు తరలివచ్చారు.