మెట్రోపై జైపూర్ మీడియా ఆసక్తి
సిటీబ్యూరో: నగర మెట్రో రైలు ప్రాజెక్టు విశిష్టతలను తెలుసుకునేందుకు జైపూర్ (రాజస్థాన్)కుచెందిన మీడియా బృందం ఆసక్తి చూపింది. శుక్రవారం ఈ బృంద సభ్యులు సైఫాబాద్‌లోని మెట్రో రైలు భవన్‌లో ఎమ్‌డీఎన్వీఎస్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్‌డీ మాట్లాడుతూ కాలుష్య ఉద్గారాలు లేని విధంగా నగర మెట్రో ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టుతో నగర పునర్నిర్మాణం జరగనుందని చెప్పారు. మూడు మెట్రో కారిడార్లలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వికలాంగులకు మెట్రో రైళ్లు,స్టేషన్లలో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రధాన రహదారుల మధ్యలో ఏడు అడుగుల విస్తీర్ణంలోనే పనులు చేపడుతున్నామని వివరించారు. నగరంలో నిర్మించనున్న 66 అత్యాధునిక మెట్రో స్టేషన్ల నిర్మాణ విశిష్టతలను తెలియజేశారు.
ఒక్కో ట్రాక్ ఏడు వరుసల బస్సు దారులు, 24 వరుసల కార్ల దారులకు సమానమని తెలిపారు. పాదచారుల వంతెనలు, స్కై వాక్‌ల ఏర్పాటు, స్టేషన్ల సుందరీకరణ, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో మెట్రో స్టేషన్ల అనుసంధానంపై వివరించారు. జైపూర్‌లోనూ ఇదే తరహాలో మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని మీడియా బృందం ఎమ్‌డీని కోరింది. ఈ బృందంలో 12 మంది సీనియర్ పాత్రికేయులు, జైపూర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కమ్యూనికేషన్ అధికారి జితేంద్ర ద్వివేది తదితరులు ఉన్నారు.