
చంద్రబాబు మంత్రివర్గంలో నేరస్తులా?
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు మహిళలను వేధించిన కేసుల్లో ఉండటం, దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి ఒకరు ఉండటం దారుణమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ ఒక నివేదికలో ఈ విషయాలను వెల్లడించిందని తెలిపారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చెన్నాయుడుపై మహిళలపై అఘాయిత్యం చేసిన కేసులున్నాయన్నారు.
రాజధాని అమరావతి చుట్టూ భూములు కొనుగోలు చేసి, చంద్రబాబు బినామీగా వ్యవహరిస్తున్న పి.నారాయణ దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి అని ఏడీఆర్ సంస్థ వెల్లడించిందని భూమన తెలిపారు.
చంద్రబాబు కాదు.. గాడ్సేబాబు
విజయవాడలో గాంధీజీ విగ్రహాన్ని కూల్చి వేసి, ఇబ్రహీంపట్నం వద్ద బుడమేరులో పారేయడం దారుణమని, దీనిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని భూమన అన్నారు. జాతిపితకు చంద్రబాబు ఇస్తున్న గౌరవం దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు.బాబు, గాడ్సే కన్నా హీనుడని ఆయన మామ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.గాంధీ విగ్రహాన్ని కూల్చేడం చూస్తే ఆయనను చంద్రబాబు కాదు, గాడ్సేబాబు అనాలా? అని ప్రశ్నించారు.