
'మంత్రి నారాయణ చంద్రబాబు బినామీ'
హైదరాబాద్: దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి నారారాయణ చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారని ఏడీఆర్ నివేదిక బయటపెట్టిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి చుట్టుపక్కల భూములను కొనేయడం ద్వారా భూ దందాకు తెర తీసి వేల కోట్లకు నారాయణ పడగలెత్తారని ఆరోపించారు. నారాయణ.. చంద్రబాబు బినామీ అని పునరుద్ఘాటించారు. రాజధాని భూ దందాపై సీబీఐ దర్యాప్తు చేయించాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతిని భూమన గుర్తు చేశారు.
అవినీతి, భూ దందా, మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించడంలో చంద్రబాబు దూసుకుపోతున్నారని దుయ్యబట్టారు. పుష్కర ఆహ్వానాలపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు లేదని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించి తీరు అభ్యంతకరమన్నారు. బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
విజయవాడలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గాడ్సే కంటే తన అల్లుడు హీనుడని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. జాతిపితకు ఇంత అవమానం జరిగినా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదన్నారు. గాడ్సే బాబు అని పిలవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని భూమన ధ్వజమెత్తారు.