మూడు రోజుల క్రితం హైదరాబాద్లో అదృశ్యమైన ఎన్నారై దారుణహత్యకు గురయ్యాడు.
హైదరాబాద్ : మూడు రోజుల క్రితం హైదరాబాద్లో అదృశ్యమైన ఎన్నారై దారుణహత్యకు గురయ్యాడు. బోయిన్‌పల్లి సమీపంలోని డెయిరీ ఫామ్ సమీపంలో అతని మృతదేహం కనిపించింది. దుండగులు అతడిని హత్యచేసి అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఎనిమిదేళ్లుగా కెన్యాలో ఉంటున్న గౌతంరెడ్డి గత సోమవారమే నగరానికి తిరిగొచ్చాడు. అయితే స్వదేశానికి వచ్చిన రోజే అతడు అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు గౌతంరెడ్డి కోసం గాలిస్తున్నారు.
కాగా ఈ రోజు ఉదయం గౌతంరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, కుటుంబసభ్యులు కూడా మృతదేహాన్ని గౌతంరెడ్డిదేనని నిర్దారించారు. ఎవరో టార్గెట్ చేసి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన గౌతంరెడ్డి చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు అని అతని పరిచయస్తులు చెబుతున్నారు. ఎంతో ధైర్యవంతుడు, నిజాయితీపరుడు అని తెలిపారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావటం బాధ కలిగిస్తోందన్నారు.