ప్రీతిరెడ్డి, హర్ష్ నర్దే
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో దారుణహత్యకు గురైన భారత సంతతి డాక్టర్ ప్రీతిరెడ్డి(32) కేసులో ప్రధాన నిందితుడు హర్ష్ నర్దే ఉద్దేశపూర్వకంగానే ట్రక్కును ఢీకొట్టి ప్రాణాలు తీసుకున్నాడని భావిస్తున్నట్లు న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు తెలిపారు. కేవలం ప్రీతిని కలవడానికి హర్ష్ ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి సిడ్నీలోని సెయింట్ లియోనార్డ్స్‌లో వైద్య సదస్సుకు హాజరయ్యాడని వెల్లడించారు. ప్రీతి మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్న విషయం హర్ష్ కు ముందుగానే తెలుసన్నారు. ‘మనిద్దరి మధ్య బంధం ముగిసిపోయింది.
నువ్వు నీదారి చూసుకో’ అని ప్రీతి హర్ష్‌కు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రీతి–హర్ష్‌ల కొలీగ్ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ..‘తాను మరొక వ్యక్తితో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాననీ, త్వరలో మెల్‌బోర్న్‌కు వెళ్లిపోతున్నట్లు ప్రీతి హర్ష్‌కు చెప్పింది. శనివారం వైద్య సదస్సు ముగిశాక ప్రీతి–హర్ష్ ఇద్దరూ కొద్దిసేపు ఆగి సరదాగా మాట్లాడుకున్నారు. కానీ అదేరోజు రాత్రి హర్ష్ తన ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను డిలీట్ చేశాడు. ఎందుకిలా చేశాడో నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. స్ట్రాండ్ ఆర్కేడ్ ప్రాంతంలో ఉన్న మెక్‌డొనాల్డ్ నుంచి ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటలకు బయటకొచ్చిన ప్రీతి.. ఐదు నిమిషాలకే తాను బసచేస్తున్న స్విస్సోటెల్ ఫోయర్ హోటల్‌కు చేరుకుందని తెలిపారు.
కాగా, పెద్ద సూట్‌కేసును హోటల్ సిబ్బంది సాయంతో హర్ష్ ఆదివారం సాయంత్రం కారులోకి ఎక్కించినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయిందని డైలీ టెలిగ్రాఫ్ కథనాన్ని ప్రచురించింది. ఈ సూట్‌కేసులో ఉన్న ప్రీతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది. కేసుకు సంబంధించి ఏం జరిగిందో కచ్చితంగా తెలుసుకునేందుకు ప్రీతి–హర్ష్ కదలికల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి మరణంపై ఆమె సోదరి నిత్యారెడ్డి స్పందిస్తూ..‘శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ప్రీతి కదలికలపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. ఈ విషయమై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment