ఇది చారిత్రక అవసరం
♦ టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా కేసీఆర్
♦ చిల్లర మల్లర చేరికలు కావు.. ఇది రాజకీయ పునరేకీకరణ
♦ గులాబీ గూటికి ఎమ్మెల్యే పువ్వాడ అజ య్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ చారిత్రక అవసరమని... అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌లోకి చేరికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వివిధ పార్టీల నుంచి జరుగుతున్న చేరికలు ఏవో చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావని గతంలోనే చెప్పానని, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అంతా కలసి పనిచేద్దామని తాను ఇదివరకే ప్రకటించానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సోమవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణకు దశ, దిశ నిర్దేశించుకునే కీలక సందర్భంలో రాష్ట్రం ఉందన్నారు. రాజకీయ పునరేకీకరణ తెలంగాణకు చారిత్రక అవసరమని చెప్పారు. తెలంగాణ వస్తే పాలనే సరిగా సాగదని నాడు సమైక్యవాదులు ఎద్దేవా చేశారని, తెలంగాణ నిలిచి గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘‘కొందరు రాజకీయమే పరమావధిగా ఎడ్డెం అంటే తెడ్డెం అనుకుంట తయారైండ్రు. ఏదన్న పని మొదలు పెట్టకముందే విమర్శలు షురూ చేసున్నరు. వాళ్లను పట్టించుకోవద్దని ప్రజలు చెబుతనే ఉన్నరు. అయినా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ శాసనసభ సాక్షిగా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించి, భవిష్యత్ తరాలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఖమ్మం పట్టణం చుట్టుపక్కల గ్రామాలకు పాలేరు నుంచి మంచినీటిని అందిస్తామన్నారు. గోదావరి నీళ్లను ఖమ్మం జిల్లా బీళ్లకు మళ్లించి సాగులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా మొదటిసారి గెలవడం సహజమేనని, తదనంతరం కొనసాగడమే కష్టమని.. ప్రజల ఆదరణ పొందడం కోసం పనిచేయాలని సూచించారు.
తగిన ప్రాధాన్యం ఇస్తాం..
‘‘ఎన్నాళ్లు బతికామని కాదు. ఎంత బాగా బతికామన్నదే ముఖ్యం. జీవితంలో ఎన్నో పనులు చేస్తం. అందులో మన బెస్ట్ కంట్రిబ్యూషన్ ఏమిటనేదే ముఖ్యం. మంచి పనులు చేస్తే ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తరు..’’ అని కేసీఆర్ అన్నారు. కొద్దిరోజులుగా మంత్రి కేటీఆర్‌తో సంప్రదిస్తు న్న పువ్వాడ చివరకు పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మలకు చేదోడు, వాదోడుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పువ్వాడకు సూచించారు.
ఇక తన స్వస్థలానికి చెందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తనకు చిరపరిచితుడని... కలసి పనిచేద్దామని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. వీరిద్దరికీ తగిన ప్రా ధాన్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్‌కు చెందిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఖమ్మం, మెదక్ జిల్లాల నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు కేసీఆర్, తుమ్మల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు కవిత, బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.