
‘వారి బెదిరింపులకు భయపడను’
హైదరాబాద్: మజ్లీస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల ఆగడాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకువెళతానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తెలిపారు. మజ్లీస్ కార్పొరేటర్లు, బస్తీ నాయకుల బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. వర్షం కారణంగా శాస్త్రీపురం, సూలేమాన్‌నగర్ డివిజన్‌లలోని లోతట్టుప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారన్నారు. వారిని పరామర్శించేందుకు తాను ఈరోజు ఉదయం అధికారులతో కలిసి వెళ్ళానన్నారు.
ఇదే సమయంలో శాస్త్రీపురం కార్పొరేటర్ మీస్భావుద్దీన్, సూలేమాన్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త కొంతమందిని పోగేసుకోని తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. బాధితులు స్వయంగా తన వద్దకు వచ్చి తీసుకోని వెళ్ళడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. మజ్లీస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రజా సమస్యలను పక్కన పెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. తాను బస్తీలలో పర్యటిస్తుంటే ప్రతి ఇంటి నుంచి సమస్యలను తెలుపుతున్నారన్నారు. ఆయా సమస్యలను తాను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానన్నారు. అభివృద్దిని అడ్డుకునే మజ్లీస్‌కు రోజులు దగ్గర పడ్డాయని ప్రకాష్ గౌడ్ అన్నారు. బస్తీలలో అభివృద్ధిపనులను నిర్వహించకుండా మజ్లీస్ కార్పొరేటర్లు, స్థానికుల నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. ఇక వారి ఆగడాలు సాగవని అన్నారు.