
ముద్రగడ దీక్ష పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదు
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని శాసనమండలిలో వైఎస్సార్‌సీపీపక్ష ఉప నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ముద్రగడ పెట్టిన డిమాండ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించి దీక్ష విరమింపచేసేలా చర్యలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
కాపులను బీసీలో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో ముద్రగడ్డ దీక్ష చేస్తున్నారని చెప్పారు. ఈ దీక్ష కు మద్దతు ఇస్తున్నారన్న కారణంతో గ్రామాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలను కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. తుని ఘటన లో పులివెందులకు చెందిన అరాచక శక్తులు విధ్వంసం సృష్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రజావ్యతిరేకమైన చర్యలతో చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారన్నారు. ఇప్పటికైనా ముద్రగడ డిమాండ్లన్నీ వెంటనే పరిష్కరించి ఆయన దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు.