
‘ముందస్తు’ఆశలు ఆవిరి!
దేశంలోకి నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశంపై ఆశలు ఆవిరయ్యాయి. వడగాడ్పులు, ఉక్కపోతల నుంచి త్వరగా తెరిపినిస్తాయనుకున్న రుతుపవనాలు ఈసారి సాధారణంకన్నా వారం రోజులు ఆలస్యంగా జూన్ 7న (నాలుగు రోజులు అటుఇటుగా) కేరళ తీరాన్ని తాకనున్నాయి.
- నైరుతి రుతుపవనాల రాక వారం ఆలస్యం
- జూన్ 7న కేరళ తీరానికి రాక
- భారత వాతావరణశాఖ ప్రకటన
- తెలంగాణ, ఏపీల్లో మరింత ఆలస్యం
- కేరళను తాకిన వారానికి ఏపీకి వర్షాలు
- ఆ తర్వాత 3, 4 రోజులకు తెలంగాణకు..
- రేపు తీరం దాటనున్న వాయుగుండం
- దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్ / విశాఖపట్నం
దేశంలోకి నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశంపై ఆశలు ఆవిరయ్యాయి. వడగాడ్పులు, ఉక్కపోతల నుంచి త్వరగా తెరిపినిస్తాయనుకున్న రుతుపవనాలు ఈసారి సాధారణంకన్నా వారం రోజులు ఆలస్యంగా జూన్ 7న (నాలుగు రోజులు అటుఇటుగా) కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఆదివారం తాజా అంచనాను ప్రకటించింది. గత 50 ఏళ్ల సరాసరి లెక్కల ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సి ఉండగా ఈ ఏడాది పది రోజుల ముందుగానే కేరళను తాకుతాయంటూ స్కైమెట్ సహా వివిధ ప్రైవేటు వాతావరణ అధ్యయన సంస్థలు అంచనా వేశాయి.
అయితే వాయవ్య భారతంలో కనీస ఉష్ణోగ్రతలు, (రుతుపవనాల ప్రవేశానికి) ముందస్తుగా శ్రీలంకలో కురిసే వర్షాలు, దక్షిణ చైనా సముద్రంపై అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ (ఓఎల్‌ఆర్) తదితర ఆరు అంశాల ఆధారంగా రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమవుతుందంటూ ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ తాజా అంచనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. ఈసారి కేరళను తాకిన వారం రోజులకు రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి ఆ తర్వాత మూడు, నాలుగు రోజులకు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.
గతేడాది రుతుపవనాలు జూన్ 5న కేరళను తాకగా... 10న రాయలసీమలోకి ప్రవేశించాయని... 13న తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రతినిధి నర్సింహారావు ‘సాక్షి’కి తెలిపారు. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఒక్కోసారి 15-20 రోజులు కూడా పట్టే అవకాశాలున్నాయని వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. రుతుపవనాల రాకపై గత పదకొండు ఏళ్లలో (2005-16) 2015లో మినహాయిస్తే ఐఎండీ అంచనాలు నిజమయ్యాయి.
సాధారణంకన్నా అధిక వర్షాలు...
ఈసారి నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణంకన్నా అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు ఆలస్యమైనా వర్షాలు మాత్రం ఎక్కువగానే కురుస్తాయని పేర్కొంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండడమే దీనికి కారణమని వివరించింది. ప్రస్తుతం బలమైన ఎల్‌నినో ప్రభావం కారణంగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, జూన్ మధ్య నాటికి పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ఎల్‌నినో ప్రభావం తగ్గి చివరకు లానినాగా మారుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు ఉధృతమై అధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కరువుతో రెండేళ్లుగా అతలాకుతలమైన రాష్ట్రం ఈసారి అధిక వర్షాల కారణంగా గట్టెక్కుతుందంటున్నారు.
17న తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం: దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు
నైరుతీ బంగాళాఖాతంలో శ్రీలంక తీరం వెంబడి, హిందూ మహాసముద్రంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఇది తమిళనాడు తీరంలోని పంబన్ - నాగపట్నం మధ్య మంగళవారం ఉదయం తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అండమాన్‌కు ముందుగానే..
సాధారణంగా మే 20కి అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి వాయవ్య దిశగా పయనిస్తుండటంతో నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారానికి నైరుతీ రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలంగాణలో నేడు వర్షాలు... వడగాడ్పులు
తెలంగాణవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని...అదే సమయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా పరిగిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదివారం ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా రామగుండంలో 43.8, నిజామాబాద్‌లో 43.4, హన్మకొండలో 43.2, నల్లగొండలో 42, మెదక్ 41.6, ఖమ్మం 38.6, భద్రాచలం, హైదరాబాద్‌లలో 37.6, హకీంపేట్‌లో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.