ఎస్ఆర్ నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల యాజమాన్యమే ఇందుకు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మోతీనగర్‌కు చెందిన శ్రీవర్ష(17) ఎస్సార్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పరీక్షలకు హాజరు కాలేదనే కారణంతో ఫిజిక్స్ లెక్చరర్ ప్రేమ్‌కుమార్ తోటి విద్యార్థుల ఎదుట తిట్టాడని, అవమానంగా భావించిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఫీజు చెల్లించటం ఆలస్యమైతే చాలు.. విద్యార్థులను గదిలోకి పిలిపించుకుని రాత పూర్వక హామీ తీసుకునే యాజమాన్యం, వారి బాగోగులు మాత్రం పట్టించుకోలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సనత్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.