ఇక వాయిదాలుండవు | New conditions has implemented on adjournments of courts | Sakshi
Sakshi News home page

ఇక వాయిదాలుండవు

Published Sun, Jul 10 2016 3:48 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

ఇక వాయిదాలుండవు - Sakshi

ఇక వాయిదాలుండవు

- సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు కొత్త నిబంధనలు
- నోటీసుల జారీ నుంచి తీర్పు వరకు నిర్దిష్ట విధానం
- ఇకపై ప్రతీ కేసు పరిష్కారానికి, విధివిధానాల పూర్తికి గడువులు
- సమన్లు, నోటీసులకు 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందే
- కేసులన్నీ నాలుగు విభాగాలుగా విభజన
- భరణం చెల్లింపు, పిల్లల కస్టడీ కేసులకు 9 నెలలు
- విడాకులు, కోర్టు తీర్పుల అమలు కేసులకు ఏడాది
- ఆస్తి వివాదాల కేసులకు రెండేళ్లలో పరిష్కారం
- మధ్యవర్తిత్వం, రాజీ అవకాశాలపై ప్రత్యేకంగా పరిశీలన

 
సాక్షి, హైదరాబాద్: కింది కోర్టులు, వివిధ ట్రిబ్యునళ్లకు పెనుభారంగా పరిణమించిన సివిల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా హైకోర్టు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు వర్తించే ‘సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్’కు కొత్త అధ్యాయాన్ని జత చేసింది. ప్రతీ కేసు విచారణకు నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించింది. కేసుకు సంబంధించి ప్రతీ విధివిధానానికి కూడా గడువు పెట్టింది. ‘కేస్ ఫ్లో మేనేజ్‌మెంట్’ పేరుతో రూపొందించిన ఈ కొత్త నిబంధనలు కింది కోర్టుల్లో ఏ కేసులను ఏ పద్ధతిన విచారించాలో నిర్దేశిస్తాయి.
 
  సమన్లు, నోటీసుల జారీ మొదలుకుని, తీర్పు వెలువరించేంత వరకు కేసు విచారణ ఏ దశలో ఎలా సాగాలో ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కేసుల ప్రతీ దశలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యానికి దీనితో ఫుల్‌స్టాప్ పడనుంది. ఇక భరణం చెల్లింపు, పిల్లల కస్టడీ, సంరక్షకుల నియామకం వంటి కేసులను గరిష్టంగా 9 నెలల్లోపు పరిష్కరించాలి. కోర్టు తీర్పుల అమలు, విడాకులు, ఖాళీ చేయించడం వంటి కేసులను 12 నెలల్లోపు పరిష్కరించాలి. ఆస్తుల విభజన, ప్రకటన, స్వాధీనం, ఇంజంక్షన్ వంటి వాటిని 24 నెలల్లో పరిష్కరించాలి. తీర్పు వెలువరించేందుకు సైతం కాల పరిమితి నిర్దేశించింది. తీర్పును రిజర్వ్ చేసుకున్న నాటి నుంచి గరిష్టంగా 2 నెలల్లోపు వెలువరించి తీరాలి. అభ్యంతరాల స్వీకరణ నిమిత్తం హైకోర్టు ఈ కొత్త నిబంధనలను ఇంతకుముందే ఉభయ రాష్ట్రాలకు పంపింది. ఎటువంటి అభ్యంతరాలు రాలేదని ప్రభుత్వాలు చెప్పడంతో.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశాయి.
 
 నాలుగు ట్రాక్‌లుగా కేసులు
 ప్రతీ కోర్టు, ట్రిబ్యునళ్ల ప్రిసైడింగ్ అధికారి తన ముందున్న కేసులను ట్రాక్-1, ట్రాక్-2, ట్రాక్-3, ట్రాక్-4లుగా వర్గీకరించాలి. ట్రాక్-1 పరిధిలోకి భరణం చెల్లింపు, పిల్లల కస్టడీ, సంరక్షకుల నియామకం, సందర్శన హక్కులు, అద్దె రికవరీ, శాశ్వత ఇంజంక్షన్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి కేసులు వస్తాయి. వీటిని 9నెలల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ట్రాక్-2 పరిధిలోకి తీర్పుల అమలు, విడాకులు, ఖాళీ చేయించడం వంటివి వస్తాయి. వీటిని 12 నెలల్లోపు పరిష్కరించాలి. ట్రాక్-3 పరిధిలోకి ఆస్తుల విభజన, ఆస్తులపై హక్కుల ప్రకటన, స్వాధీనం, తప్పనిసరి ఇంజంక్షన్, అప్పీళ్లు, ఖర్చులు, అనుభవ హక్కు, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, పేటెంట్లు, మేథోసంపత్తి హక్కులు తదితర కేసులు వస్తాయి. వీటిని 24 నెలల్లోపు పరిష్కరించాలి. మొదటి 3 ట్రాక్‌ల పరిధిలోకి రాని కేసులు ట్రాక్-4 పరిధిలోకి వస్తాయి. ట్రాక్-3, 4 కేసులను ప్రతివాదులు కోర్టులో హాజరైన నాటి నుంచి 24 నెలల్లోపు పరిష్కరించాలి.
 
 సమన్ల జారీకి గడువు
 తమ ముందున్న కేసుల్లో నోటీసులు, సమన్లు జారీ చేసినప్పుడు... జారీ చేసిన తేదీ నుంచి గరిష్టంగా 30 రోజుల్లోపే రాతపూర్వక సమాధానం గానీ, అభ్యంతరాలు గానీ సమర్పించాలని పేర్కొనాలి. ప్రతివాదులకు అందజేసేందుకు వీలుగా పిటిషనర్ తాను దాఖలు చేసిన కేసుకు సంబంధించిన పిటిషన్, తాత్కాలిక ఊరట కోసం సమర్పించే వ్యాజ్యకాలీన దరఖాస్తు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను కోర్టులో సమర్పించాలి. ప్రతివాదుల చిరునామాలను పిటిషనర్ స్పష్టంగా పేర్కొనాలి. ఇది కచ్చితంగా అమలయ్యేలా సంబంధిత కోర్టు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులు గానీ ప్రతివాదులుగా ఉండి వారికి కోర్టులు నోటీసులు జారీ చేయాల్సి వస్తే... వాటిని ఆ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులకు అందచేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలకు సమన్లు, నోటీసులు ఇవ్వాలనుకుంటే వాటిని ఆ సంస్థల న్యాయవాదులకు అందేలా చూడాలి.
 
 ఏయే దశల్లో కేసుల విచారణ
 సమన్లు లేదా నోటీసుల జారీతో కేసు విచారణ ప్రారంభమవుతుంది. నోటీసుల జారీ అనంతరం ప్రతివాదులు కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రతివాది ఇచ్చే రాతపూర్వక సమాధానం లేదా దానికి పిటిషనర్ అభ్యంతరాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాజ్యకాలీన దరఖాస్తులపై విచారణ చేపట్టిన తరువాత సంబంధిత కేసును మధ్యవర్తిత్వానికి లేదా రాజీకి లేదా లోక్ అదాలత్‌కు నివేదించే అవకాశాలను పరిశీలించాలి. తీర్పులో తేల్చాల్సిన అంశాలను నిర్ణయించాలి. తరువాత సాక్ష్యాలను నమోదు చేసి ఇరుపక్షాల వాదనలు విని తీర్పునివ్వాలి.
 
 రెండు కాజ్ లిస్టుల రూపకల్పన
 ప్రిసైడింగ్ అధికారి రోజూ విచారణకు వచ్చే కేసులకు సంబంధించి రెండు కాజ్‌లిస్టులు (విచారణకు వచ్చే కేసుల జాబితాలు) రూపొందించాలి. వ్యాజ్యకాలీన దరఖాస్తుల విచారణ, మధ్యవర్తిత్వం లేదా రాజీ లేదా లోక్ అదాలత్‌లకు నివేదించే కేసులు, వాదనలు, తీర్పులు వెలువరించే కేసుల గురించి కాజ్‌లిస్ట్-1లో పేర్కొనాలి. సమన్లు, నోటీసుల జారీ, ప్రతివాదుల హాజరు, రాతపూర్వక సమాధానం సమర్పణ, పిటిషనర్ల అభ్యంతరాలు తదితరాలను కాజ్‌లిస్ట్-2లో పేర్కొనాలి. సాక్ష్యాల నమోదు, వాదనల నిమిత్తం విచారించే కేసులను 30 రోజుల ముందుగానే కోర్టు నోటీసు బోర్డులో ఉంచాలి.
 
 రాజీ అవకాశాల పరిశీలన
 రాతపూర్వక సమాధానం సమర్పించిన తరువాత పార్టీల మధ్య ఆ కేసును పరిష్కరించే అవకాశాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలించాలి. పరిష్కార అవకాశాలుంటే ఆ కేసును మధ్యవర్తిత్వానికి లేదా రాజీకి లేదా లోక్ అదాలత్‌కు నివేదించవచ్చు. కేసు పరిష్కారమైతే ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాల మేర తీర్పునివ్వొచ్చు. లేదంటే సాధారణ పద్ధతిలోనే కేసును విచారించి తీర్పునివ్వాలి.
 
 రెండు నెలల్లో తీర్పు
 సాక్షుల వాంగ్మూలాలను కోర్టు లేదా కోర్టు అనుమతి ద్వారా నియమితులైన కమిషనర్ నమోదు చేస్తారు. సాక్ష్యాల నమోదుకు కమిషనర్‌కు నిర్దిష్ట కాల పరిమితి విధించాలి. సాక్ష్యాల నమోదుకు అవసరమైన డాక్యుమెంట్లను కమిషనర్‌కు అందచేయవచ్చు. అయితే ఒరిజినల్ ఫైల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషనర్‌కు ఇవ్వరాదు. సాక్ష్యాల నమోదు పూర్తయిన 15 రోజులకల్లా వాదనలు ప్రారంభించాలి. ఇరు పార్టీలు కూడా తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించవచ్చు. వాదనలు పూర్తయిన తరువాత అదే రోజు లేదా తీర్పు రిజర్వు చేసిన రెండు నెలల్లోపు తీర్పును వెలువరించాలి.
 
 మళ్లీ మళ్లీ నోటీసులు అవసరం లేదు
 ఒకసారి ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వ రంగ సంస్థల న్యాయవాదులకు అందచేసిన నోటీసులు సక్రమమైనవే అయితే మళ్లీ ఆయా ప్రభుత్వాలకు గానీ, ప్రభుత్వాధికారులకు గానీ ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమన్ల జారీకి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి 7 రోజుల్లోపు ప్రతివాదులకు అందాల్సిన పిటిషన్, ఇతర డాక్యుమెంట్లను కోర్టు సిబ్బందికి పిటిషనర్ అందచేయాలి.
 
 లేనిపక్షంలో కోర్టు ఆ కేసును కొట్టివేసే జాబితాలో వేసుకోవాలి. సమన్లు జారీ అయిన నాటి నుంచి 21 రోజుల్లోపు మళ్లీ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అదే జిల్లా కాకుండా వేరే జిల్లాకు నోటీసులు, సమన్లు వెళ్లాల్సి ఉంటే 30 రోజుల వరకు గడువు తీసుకోవచ్చు. సమన్లు తీసుకునేందుకు ప్రతివాది తిరస్కరిస్తే.. కోర్టు ప్రతివాదుల పరోక్షంలో కేసును విచారించి తీర్పునివ్వొచ్చు. పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి సమన్ల జారీలో అసాధారణ జాప్యమే కారణమని గుర్తించిన హైకోర్టు దానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ గడువులను నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement