‘కల్తీ’ నరేందర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు | Notices of police officers to the hospital | Sakshi
Sakshi News home page

‘కల్తీ’ నరేందర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

Published Sat, May 21 2016 12:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

‘కల్తీ’ నరేందర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు - Sakshi

‘కల్తీ’ నరేందర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

ఆసుపత్రి అధికారులకు పోలీసుల నోటీసులు
 
 హైదరాబాద్: హైదరాబాద్ సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ‘నకిలీ రక్తం’ వ్యవహారంలో సూత్రధారి అయిన నరేందర్ ప్రసాద్‌పై సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ బుక్‌చేశారు. ఈ వ్యవహారంపై ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు బృందం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కీలక వివరాలు సేకరించారు. నకిలీ రక్తాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు సేకరించి పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు. నరేందర్ ఆచూకీ కోసం సరూర్‌నగర్‌లో గాలింపు చేపట్టడంతో పాటు అతని ఫోన్‌కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు.

 విభేదాలతో కల్తీ విషయం బహిర్గతం..
 మూడేళ్ల క్రితం నరేందర్‌ప్రసాద్ ఆసుపత్రి బ్లడ్‌బ్యాంకులో చేరాడు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన నరేందర్ ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం అవసరమైన వారికి గ్లూకోజ్ కలిపిన కల్తీ రక్తాన్ని విక్రయించేవాడు. దీనికోసం కల్తీ చేసిన రక్తం ప్యాకెట్లను సిద్ధం చేసుకునేవాడు. కొంతకాలం నుంచి ల్యాబ్‌లో పనిచేస్తున్న రాఘవేందర్‌ను 10 రోజుల క్రితం విధుల నుంచి తప్పించారు. దీంతో రాఘవేందరే తెలంగాణ వాలంటరీ బ్లడ్‌బ్యాంక్ అసోసియేషన్ వారికి సమాచారం అందించి ఉండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా నరేందర్ కూడా తనకు చికెన్‌ఫాక్స్ వచ్చిందని 6 రోజులుగా ఆసుపత్రికి రావడం లేదని అధికారులు తెలి పారు. కాగా, బుధవారం డ్రగ్ కంట్రోల్ అధికారులు నరేందర్ ఇంట్లో తనిఖీలు చేపట్టినప్పడు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారి పేర్లు తెలిపినట్లు సమాచారం.

 బాధ్యులపై కఠిన చర్యలు: సూపరింటెండె ంట్ డాక్టర్ రత్నకుమారి
 ‘మా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో ఇన్‌చార్జి డాక్టర్ నిర్మల, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒకస్టాఫ్ నర్సు, మరొకరు విధులు నిర్వహిస్తారు. మాకు కేవలం నకిలీ బ్లడ్‌బ్యాంక్ స్టిక్కర్లు మాత్రమే లభ్యమయ్యాయి. అయితే రక్తం కల్తీలో ఎవరి ప్రమేయం ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’

 ఆసుపత్రి అధికారులకు నోటీసులు జారీచేసిన పోలీసులు...
 ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫిర్యాదులో స్పష్టత లేదని, సరూర్‌నగర్‌లోని నరేందర్ ఇంటిపై పోలీసులు లేకుండా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అజయ్ దాడులు చేయడంతో నరేందర్ తప్పించుకున్నాడని, రక్తంలో గ్లూకోస్ కలిపిన దాఖలు లేవని, దాతలు ఇచ్చిన రక్తంపై నకిలీ స్టిక్కర్లు వేసి రక్తం అమ్ముతున్నారా? ఇలా పలు అంశాలు సరిగా లేవని పోలీసులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేశారు.
 
 కల్తీరక్తం వల్లే నా భార్య చనిపోయింది
 ఆసుపత్రి ముందు బంధువులతో కలసి భర్త ఆందోళన


 సుల్తాన్‌బజార్ బ్లడ్‌బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తం ఎక్కించడం వల్లే తన భార్య చనిపోయిందంటూ.. బంధువులతో కలసి భర్త  శుక్రవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగాడు. మల్లాపూర్‌కు చెందిన బాబు భార్య మేఘమాల(29) రెండో కాన్పుకోసం ఈ నెల 12న సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. అయితే సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోని కల్తీరక్తం ఎక్కించడం వల్లే తన భార్య చనిపోయిందని భర్త, బంధువులు శిశువుతో సహా శుక్రవారం ఆసుపత్రి ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కల్తీ రక్తంపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement