ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు, పోలీసుల మధ్య రగడ ఏర్పడింది. సోమవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ కరాటే రాజు నేతృత్వంలో 12 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లు పై చర్చించి వెంటనే పార్లమెంట్‌కు పంపించాలనే డిమాండ్‌తో కార్యక్రమాన్ని చేపట్టినట్లు కరాటే రాజు చెప్పారు.
చలో అసెంబ్లీ కోసం క్యాంపస్‌ను బంద్ చేశారు. వర్సిటీ ప్రవేశ ద్వారం ఎన్‌సీసీ గేటు వద్ద వేచిఉన్న పోలీసులు విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి ముళ్ళకంచె పొదను తోశారు. పోలీసులు విద్యార్థులను వారించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బయటకు వెళ్లనివ్వకపోవడంతో కోపొద్రిక్తులైన విద్యార్థులు పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించారు. విద్యార్థుల చర్యలను చాలా వరకు ఉపేక్షించిన పోలీసులు చివరకు భాష్పవాయువుగోళాలను ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ఆందోళనలో ఆంజనేయులు, నెహ్రూనాయక్, మన్నేక్రిషాంక్, సంపత్‌నాయక్, సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో ‘చలో అసెంబ్లీ’ రగడ
Published Tue, Jan 7 2014 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement