
పహిల్వాన్ ప్రస్థానం
ఒకప్పటి సరూర్‌నగర్ గ్రామ పంచాయతీ నేడు డివిజన్‌గా రూపాంతరం చెందింది. ఎల్‌బీనగర్ సర్కిల్ కార్యాలయానికి ప్రధాన కేంద్రంగా మారింది.
ఎల్‌బీనగర్ మున్సిపల్ ప్రథమ చైర్మన్ దర్పల్లి నర్సింహ
హుడాకాంప్లెక్స్: ఒకప్పటి సరూర్‌నగర్ గ్రామ పంచాయతీ నేడు డివిజన్‌గా రూపాంతరం చెందింది. ఎల్‌బీనగర్ సర్కిల్ కార్యాలయానికి ప్రధాన కేంద్రంగా మారింది. అయితే 1970, 1981లలో నిర్వహించిన సరూర్‌నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దర్పల్లి నర్సింహ(పహిల్వాన్ నర్సింహ) ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సరూర్‌నగర్ పరిసర ప్రాంతాలను కలుపుకొని 1987లో ఎల్‌బీనగర్ మున్సిపాలిటీగా మారింది. 1992 వరకు ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న మున్సిపాలిటీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పహిల్వాన్ నర్సింహ ప్రథమ చైర్మన్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం 1998 నుంచి బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి ఆకుల రమేశ్‌గౌడ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
మున్సిపాలిటీ 2004లో జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో సరూర్‌నగర్ డివిజన్‌గా మారింది. ‘మూడో తరగతి వరకే చదువుకున్నాను. నా స్వగ్రామం ఇసామియా బజార్. అత్తగారి గ్రామం సరూర్‌నగర్‌కు వస్తుండేవాడిని. పహిల్వాన్‌గా ఢిల్లీ స్థాయి పోటీల్లో పాల్గొనడంతో ప్రభుత్వం గుర్తించి ఆర్టీసీ సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఉద్యోగం కల్పిం చింది. సర్పంచ్, మున్సిపల్ చైర్మన్‌గా ప్రజాసేవ చేశాను. నా కుమారుడు అశోక్ కూడా కౌన్సిలర్‌గా ప్రజాసేవకు అంకితమయ్యాడ’ని పహిల్వాన్ నర్సింహ తన అనుభవాలు పంచుకున్నారు.