ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
Published Tue, Mar 21 2017 5:54 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
హైదరాబాద్ : హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం అంబర్‌పేట్ ఇండోర్‌స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ ఓట్ల లెక్కింపుకు ముందస్తుగా నేడు మాక్ కౌంటింగ్‌ను నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ కౌంటింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఓట్లల్లో 50 శాతం కన్నా తక్కువ వస్తే తిరిగి ఎలిమినేషన్ ప్రక్రియను ఏ విధంగా నిర్వహించాలన్న అన్న అంశంపై సిబ్బందికి వివరించారు.
మొత్తం 28 టేబుళ్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయగా, మూడు షిఫ్టులకు కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఒక్కో షిఫ్టునకు 30 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్‌లు, 90 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌లను నియమించారు. ఈ కౌంటింగ్ ప్రక్రియను సీసీటివీల ద్వారా ఎన్నికల సంఘం నేరుగా పరిశీలించనుంది. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి వచ్చే అభ్యర్ధుల ఏజెంట్‌లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేశారు. ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్ పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగనుంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించాల్సి ఉండగా, ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా రాలేదు.
ఉదయం ప్రారంభమయ్యే ఈకౌంటింగ్ సందర్భంగా బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ టేబుళ్ళ వద్ద అభ్యర్ధులు, వారి ఏజెంట్‌ల సమక్షంలో తెరవనున్నారు. ముందుగా బ్యాలెట్ పత్రాలను 25 బ్యాలెట్ లేదా 50 బ్యాలెట్‌లను ఒక్కో కట్టగా కడతారు. పోలైన ఓట్లల్లో బ్యాలెట్ పేపర్‌పై నోటాకు మొదటి ప్రాధాన్యత ఓటు (1) మార్క్ చేసినట్లైతే ఆ ఓటు చెల్లని ఓటుగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన అనంతరం ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.
Advertisement