సుశృత మామ జైల్లో గుండెపోటుతో మృతి
హైదరాబాద్: వారం రోజుల క్రితం నగరంలో సంచలనం రేపిన వివాహిత సుశృత ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మామ శంకర్ రావు ఆదివారం ఉదయం హార్ట్‌ఎటాక్‌తో మృతిచెందాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. నగరంలోని సైదాబాద్ పూసలబస్తీకి చెందిన సుశృతను వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందనే నెపంతో వారం రోజుల క్రితం ఆమె భర్త తీవ్రంగా కొట్టాడు. చదవండి: హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు!
బాత్రూంలో ఉన్న ఆమెను వివస్త్రగా ఉండగానే కుటుంబసభ్యుల ఎదుట తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు వాట్సప్‌లో తన తండ్రికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు మామ శంకర్‌రావును అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం శంకర్‌రావు గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.