ఇది గల్లా ఎగరేసిన తెలంగాణ
వాస్తవిక, ప్రజా కోణంలోనే బడ్జెట్: ఈటల
సాక్షి, హైదరాబాద్: ‘గతంలో మాదిరిగా తెలంగాణ ప్రజలు చిన్నగా, గరీబులుగా, దిక్కులేని వాళ్లుగా ఉండాలని కోరుకోవడం లేదు. కన్నీళ్లు, కష్టాలు, వలస పాటలు పాడుకునే దుస్థితి మారాలి. అప్పటి సమస్యలన్నీ మా కళ్ల ముందున్నాయి. అందుకే ప్రజలకు భరోసా కల్పించే దృక్పథంతో ఈ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణ గల్లా ఎగరేసుకుని నిలబడాలి..’’ అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వాస్తవిక, ప్రజా కోణం ఉన్న బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని.. తమ ఆలోచన, పనివిధానం సంక్షేమం చుట్టూనే తిరుగుతుం దన్నా బడ్జెట్‌పై జరిగిన చర్చకు శనివారం ఈటల సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
గత బడ్జెట్‌లో 86.5 శాతం ఖర్చు
ఏ రాష్ట్రం కూడా వందకు వంద శాతం బడ్జెట్‌ను ఖర్చు చేయలేదని ఈటల పేర్కొన్నారు. రాబడి, ఖర్చుల లెక్కలు పక్కాగా చూడడానికి ప్రభుత్వం ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కాదని.. రాబడిని అంచనా వేసి ఖర్చు చేస్తారని స్పష్టం చేశారు. 2015-16 బడ్జెట్‌లో 86.5 శాతం మేర ఖర్చు పెడుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ 80 శాతానికి మించి బడ్జెట్ ఖర్చు చేయలేదని చెప్పారు. రెవెన్యూ వృద్ధిరేటు పెరగడంతో 2016-17లో కేటాయించిన రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు పెడతామన్నారు.
కరెంటు, నీళ్లు, సంక్షేమం..
తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారమేనన్న విమర్శలు పటాపంచలయ్యాయని, నిరంతర విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ లేక పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. రైస్, కాటన్ మిల్లులు మూతపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిశ్రమలకు 24గంటల విద్యుత్ అందిస్తున్నాం. రైతులకు పగటిపూటే ఇస్తున్నాం. భద్రాద్రి ప్రాజెక్టు పని మొదలైంది. యాదాద్రిలో 800మెగావాట్ల సామర్థ్యంతో 5 యూనిట్లు సిద్ధం చేస్తున్నాం. సింగరేణి, ఎన్టీపీసీ విద్యుదుత్పత్తికి ముందుకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రూ.16,169కోట్లు పెట్టినం. రూపాయికి కిలో బియ్యం పథకం కోసం కేంద్ర నిధులకు అదనంగా రూ.2,800కోట్లు ఖర్చు పెడుతున్నాం. సన్నబియ్యానికి రూ.700కోట్లు ఖర్చు పెట్టాం. ఇరవై నెలల్లోనే 5,706 కిలోమీటర్ల రోడ్లు వేశాం. 8,138 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు వేశాం. పదేళ్ల కాంగ్రెస్ హయంలో అది 2,383 కిలోమీటర్లే..’’ అని వివరించారు.
రైతాంగానికి రూ.40వేల కోట్లు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.5వేల కోట్లు ఇస్తున్నామని, బడ్జెట్‌లో రైతులకు రూ.40వేల కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఈటల పేర్కొన్నారు. వేల కోట్లు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వేల కోట్లు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.
పైసల చుట్టూనే మీ యావ
బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రతిపక్షాల విమర్శలకు అదే స్థాయిలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సభ్యులు చేసిన విమర్శలపై స్పందిస్తూ ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీ యావ అంతా పైసల చుట్టూ తిరిగిందే తప్ప మనిషి చుట్టు తిరగలేదు’ అని వ్యాఖ్యానిం చారు. ప్రజలను ఎప్పుడూ ఫూల్స్ చేయలేరన్న భట్టి మాట లను ఉటంకిస్తూ అవి కాంగ్రెస్ వాళ్లకే వర్తిస్తాయని కౌంటర్ ఇచ్చారు. ‘వరంగల్, నారాయణఖేడ్, ఖమ్మం, హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు ఇవే విషయాలను ఇంతకన్నా ఫోర్స్‌గా చెప్పారు. అయినా ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఈటల తన ప్రసంగంలో పలు సామెతలను వాడి ఆకట్టుకున్నారు. ‘పరిగ ఏరుకుంటే రాదు బిడ్డా.. పంట పండితేనే సంతోషం వస్తది’ అని రైతుల స్థితిగతులపై సమాధానమిచ్చారు.
ఏడాది పొడవునా తాగునీరు
రెండేళ్లు కరువు వచ్చినా తాగునీటికి ఇబ్బంది రావద్దనేది తమ ఆలోచన అని ఈటల చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాదిలోనే 6,100 గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు నీళ్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో 216 పథకాలు ప్రకటించామని, అవేవో ప్రతిపక్షాలకు కూడా తెలియవని వ్యాఖ్యానించారు. ‘‘ఆటోలు, ట్రాక్టర్ల మీద ఎన్నెన్నో కేసులుండేవి. పాత బకాయిలు రద్దు చేసి పన్ను తొలగించాం. జర్నలిస్టులకు రూ.వంద కోట్లతో బడ్జెట్ పెట్టాం. ప్రమాదాల్లో చనిపోయే డ్రైవర్లకు, హోంగార్డులకు రూ.5లక్షల బీమా కల్పించాం. రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నాలు చేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం జీతాలు పెంచాం. హోంగార్డులకు కూడా రూ.12వేలు జీతమిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే..’’ అని ఈటల పేర్కొన్నారు. కొద్దికాలంలో దేశంలోనే నేరాలు తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందని, శాంతిభద్రతల పరిరక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేదలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో నాలుగు కొత్త ఆసుపత్రులకు త్వరలోనే పునాది రాయి వేస్తామని.. కరీంనగర్, ఖమ్మంలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతామని చెప్పారు.