జూన్ 2న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: క్రమబద్ధీకరణకు అర్హత గల కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను ఈ నెల 21వ తేదీలోగా ఆర్థిక శాఖకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినం జూన్ 2 సమీపిస్తున్న నేపథ్యం లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఆవిర్భావ దినం కానుకగా జూన్ 2న సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఉత్తర్వులు జారీ చేయనున్నారని తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాచార హక్కు చట్టం అమలు తదితర అంశాలపై మంగళవారం సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. జీవో 16లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను ఆయా శాఖల కార్యదర్శులు స్వయంగా పరిశీలించి ప్రభుత్వ ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపాలని సూచించారు. ఈ జాబితాలను పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే తక్షణమే ఆమోదించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 30 ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 100కు పైగా విభాగాధిపతి(హెచ్‌వోడీ) కార్యాలయాలున్నాయి. శాఖల వారీగా కాకుండా హెచ్‌వోడీ కార్యాలయాల వారీగా రోజుకు రెండు మూడు జాబితాలే వస్తున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో శనివారంలోగా అన్ని శాఖలు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను సమర్పించాలని సీఎస్ గడువు విధించారు.
అన్ని జాబితాలు వస్తే స్పష్టమైన లెక్క!
వాస్తవానికి గత నెలతోనే గడువు పూర్తి కాగా.. కొన్ని హెచ్‌వోడీల నుంచే కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలు అందాయి. రాష్ట్రంలోని 30 ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 25 వేల మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలి పాయి. అయితే జీవో 16లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఉద్యోగులనే ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. అన్ని శాఖ ల నుంచి జాబితాలు వచ్చిన తర్వాతే కచ్చితమైన లెక్కలు వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున క్రమబద్ధీకరణ పొందే ఉద్యోగుల జాబితాలను ప్రకటిస్తూ శాఖల వారీగా జీవోలు జారీ కానున్నాయి. ఆ వెంటనే సంబంధిత హెచ్‌వోడీలు అపాయింట్‌మెంట్ ఆదేశాలు జారీ చేయనున్నాయి. కాగా, సమాచార హక్కు చట్టం అమలుపై ప్రతినెలా నివేదికలను సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ ఆదేశించారు. కొన్ని శాఖలు ఆలస్యం చేస్తుండటంతో సమాచార కమిషనర్ల నుంచి రిమైండర్లు వస్తున్నాయని ఆయన అన్నారు.
అన్నింటికీ అఫిడవిట్లు అవసరమా?
ప్రభుత్వ సేవల కోసం పౌరుల నుంచి ప్రమాణ పత్రాలు(అఫిడవిట్)ల స్వీకరణ అంశంపై పునఃసమీక్ష జరపాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ కోరారు. అవసరం ఉన్నా.. లేకున్నా ప్రతి పనికీ అఫిడవిట్లు కోరకుండా పంజాబ్ అమల్లోకి తెచ్చిన కొత్త విధానంపై అధ్యయనం జరపాలని సూచించారు. అఫిడవిట్ అవసరమైన, అవసరం లేని ప్రభుత్వ సేవలను శాఖల వారీగా గుర్తించాలని సూచించారు. అయితే మన రాష్ట్రంలో అనవసర విషయాల్లో అఫిడవిట్లను కోరడం లేదని పలు శాఖల అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.