స్థానికత రుజువు బాధ్యత విద్యార్థులదే
* అధికారుల తాజా ప్రతిపాదన
* అఫిడవిట్లు తీసుకోవాలన్న ఆలోచన
* 1956 కటాఫ్ ఎడతెగని కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తింపజేసేందుకు 1956కు ముందు నుంచి నివసించడాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని స్థిర నిశ్చయానికి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. తమ స్థానికతను నిరూపించుకునే బాధ్యతను విద్యార్థుల మీదే పెట్టనుంది. 1956కు ముందునుంచి విద్యార్థుల కుటుంబాలు తెలంగాణలో నివసిస్తున్నట్లు రుజువులు చూపడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువని, అధికారికంగా ఎలాంటి ఆధారాలు దొరకవని ముఖ్యమంత్రి కేసీఆర్‌దృష్టికి తెచ్చిన అధికారులు...న్యాయస్థానాల్లో ఇబ్బందులు రాకుండా విద్యార్థుల మీదే స్థానికత నిర్థారణ బాధ్యతలను పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన మేరకు 1956కు ముందునుంచి తమ కుటుంబం ఎక్కడ నివసించిందన్న వివరాలతో విద్యార్థి స్వయంగా ప్రవేశాల సమయంలో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
1956కు ముందు తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా, ఒకేచోట నివసించారా.. వివిధ ప్రాంతాల్లో ఉన్నారా.. ఎక్కడ ఎంతకాలమున్నారు.. తదితర వివరాలను విద్యార్థి స్వయంగా వెల్లడించాలి. తాను సమర్పించిన వివరాలు తప్పని తేలితే ఎలాంటిచర్యలను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమని విద్యార్థి పేర్కొనవలసి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరానికి ఇలా కానిచ్చేసి, పూర్తిస్థాయి పరిశీలన తర్వాత విధివిధానాలను మున్ముందు రూపొందించవచ్చునని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించిన సందిగ్ధతకు తెరదించాలని ప్రభుత్వం భావిస్తోంది.
1956 తర్వాత తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారికి ఫీజులు చెల్లించేది లేదని, ఈ ప్రాతిపదిక ఆధారంగానే అధ్యయనం చేసి నివేదికలు తయారు చేయాలని కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించారు. తెలంగాణ వాసుల్లోనూ చాలామందికి 1956కు ముందునుంచి ఇక్కడే నివసిస్తున్నట్టు రుజువు చేసుకోవడం దాదాపు అసాధ్యమన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులనుంచే అవిడవిట్లు తీసుకోవాలన్న ప్రతిపాదనను సీఎం ముందుంచనున్నారు.