
మహారాష్ట్రకు మన హక్కులు తాకట్టు: రేవంత్
గోదావరి జలాల విషయంలో రాష్ట్ర హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని టీటీడీపీ విమర్శించింది.
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల విషయంలో రాష్ట్ర హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని టీటీడీపీ విమర్శించింది. సాగునీటి ప్రాజెక్టులపై ఆ రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందాన్ని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తప్పు పట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. గతంలోనే తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి 148 మీటర్ల ఎత్తుతో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు.
గోదావరిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సృష్టించినట్లు పోజులు కొడుతున్నారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్న అంశాలపై తెలంగాణ టీడీపీ నేతలతో చర్చించారు. గతంలో బాబ్లీ సహా అన్ని ప్రాజెక్టులు అక్రమమని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఇప్పుడు వాటిని సక్రమ ప్రాజెక్టులని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.