'కేసీఆర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ అమరవీరులకు న్యాయం చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలస్యం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే కుటుంబ సభ్యులకు అధికారం పంచిన కేసీఆర్ తెలంగాణ బిడ్డలపై కేసులు ఉపసంహరించడంలో.. అమరవీరుల కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెల్లని నియామక పత్రాలు అమర వీరుల కుటుంబాలకు ఇవ్వడం దారుణం అని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 27మందికి నియామక పత్రాలు ఇవ్వగా వారికి అలాంటి ఉద్యోగాలు లేవని తిప్పిపంపారనే విషయం గుర్తు చేశారు. ఇది వారిని అవమానించడమే అన్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసుల విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా నల్గొండకు చెందిన జేఏఈసీ కన్వీనర్ రాయపూడి చిన్ని, కో కన్వీనర్ బంగారు నాగమణి, తెలంగాణ విద్యావంతుల వేదిక చిలక రమేష్, జీఎల్ఎన్ రెడ్డి కోదాడ కోర్టు వద్ద పడిగాపులు పడ్డారని లేఖలో ప్రస్తావించారు. ఇంకా అనేక ప్రాంతాల్లో కేసులతో సతమవుతున్నవారి వివరాలు లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
ఉద్యమ సమయంలో మొత్తం 3152 కేసులు ఉంటే అందులో ఇంకా వెయ్యి కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు పెట్టిన కేసులు కూడా ఎత్తివేయించే చొరవ తీసుకోవాలని, ఈవిషయంలో తమ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల వివరాలు, వారి కుటుంబాలకు అందిన సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన లేఖపై స్పందన రాకుంటే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.