
యూత్ ఫెస్ట్.. సూపర్‌హిట్
అట్టహాసంగా ‘సాక్షి ఎరీనా వన్’ వేడుక
సిటీబ్యూరో: ఒకటీ రెండూ కాదు.. సిటీకి చెందిన 225 కాలేజీల విద్యార్థుల మధ్య పోటీ. పలు సాంస్కృతిక అంశాల్లో నువ్వా.. నేనా.. అన్నట్టు తలపడ్డారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ‘సాక్షి’ మీడియా నిర్వహించిన ‘సాక్షి ఎరీనా వన్’ ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహించింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో విన్నర్స్, అచీవర్స్, స్టూడెంట్స్, సెలబ్రీటీస్ మధ్య ఎరీనా ఫినాలే గ్రాండ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. వేలమంది విద్యార్థుల కేరింతల మధ్య సెలబ్రిటీస్ ఆటపాటలతో ప్రాంగణం జోష్‌తో నిండిపోయింది. ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తి దాయక ప్రసంగం.. విద్యావేత్త డాక్టర్ లావు రత్తయ్య అనుభవ పూర్వక సందేశం, ఎంపీ మల్లారెడ్డి ఉల్లాసభరిత ప్రసంగం యువతను ఆకర్షించాయి. చిత్ర దర్శకుడు దశరథ్, సినీనటులు మంచు లక్ష్మి, మనోజ్, నిర్మాత శివకుమార్ మాట్లాడారు. క్రీడాకారిణి సింధు.. విద్యార్థులకు ఇలాంటి మంచి వేదిక ఇచ్చిన సాక్షికి అభినందనలు తెలిపారు. ‘మలుపు’ చిత్ర హీరో ఆది, నిక్కి గల్రానీ, హీరో సునీల్ ఆటపాటలతో అలరించారు. అడవి శేష్, అదాశర్మ తమ కొత్త చిత్రం గీతాలకు సెప్పులేసి ఆకట్టుకున్నారు.
‘సాక్షి’కి కృతజ్ఞతలు
చదువుతో పాటు ఇతర అభిరుచుల్లో ముందున్న మాలోని ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ ఎరీనా వన్ మంచి వేదికైంది. రోబోటిక్స్ విభాగంలో రాణించడం చాలా ఆనందంగా ఉంది. కాలేజీ లెక్చరర్ల సపోర్ట్‌తో వందలాది మంది విద్యార్థులు పోటీపడిన ఈ విభాగంలో ఉత్తమ ప్రతిభను కనబరిచా. ఈ గుర్తింపు సాక్షితో వచ్చిందే. - ఎస్.శివ తేజ, బీటెక్ విద్యార్థి, సీఎంఆర్ కాలేజీ
చాలా హ్యాపీగా ఉంది..
విద్యార్థులకు చదువుతో పాటు మంచి అభిరుచులు ఉంటాయి. వీటిని కొంత మంది ఉపాధిగా కూడా ఎంచుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ‘సాక్షి’ ఎరీనా వన్ ఫెస్ట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. థియేటర్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు హ్యపీగా ఉంది. ఇలాంటి పోటీలు ఏ మీడియా చేయలేదు. ఈ గురుతర బాధ్యతను తీసుకున్న సాక్షికి నా సెల్యూట్.
- థెర్రిస్సామ్నా, బీఎస్సీ నర్సింగ్, విజయ మేరీ కాలేజీ
కళాత్మకతకు ఇదే ‘సాక్షి’
టాలెంట్ ఉన్నా సరైన వేదిక లేని మాలాంటి వారందరికీ ‘ఎరీనా వన్’ మంచి వేదికైంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. పెయింటింగ్ విభాగంలో విజేతగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. నాలో ఉన్న కళను ప్రపంచానికి చాటగలిగినందుకు సంతోషంగా ఉంది.
- మేఘన, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ
ప్రతిభావంతులకు వేదిక..
నేను పాటలు బాగా పాడతా. డాన్స్ కూడా చేస్తా. ఇన్నాళ్లు నా ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన వేదిక దొరకలేదు. ఇప్పుడీ ఈ మహదావకాశం సాక్షి ఎరీనా వన్ ద్వారా రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ వేలాది మంది ప్రేక్షకుల ముందు సోలో డాన్స్ చేయడం లైఫ్‌లో మరచిపోలేను.
- శాలినీ, బీటెక్ విద్యార్థిని, ఎంఎల్‌ఆర్‌ఐటీ