జిల్లాకో సైన్స్ సెంటర్
ప్రతిపాదనలు సిద్ధం చేయండి: అధికారులకు మంత్రి జోగు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక అంశాలు క్షేత్రస్థాయి వరకు చేరేందుకు జిల్లాకో సైన్స్ సెంటర్ , రీజినల్ సైన్స్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. హైదరాబాద్‌లో రూ.176 కోట్లతో నెలకొల్పనున్న సైన్స్ సిటీలో అంతరిక్ష, భూతల కేంద్రం, ఐమాక్స్ 9-డీతో పాటు ఎనర్జీ, శాస్త్ర, సాంకేతిక, మానవ, వృక్ష, జంతు, శాస్త్రీయ అంశాల నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి అంశాలపై మంత్రి శుక్రవారం సమీక్షించారు. ప్రతిష్టాత్మక సైన్స్ సిటీ హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌గా నిలవనుందన్నారు. బిర్లా ప్లానిటోరియం తరహాలో సంచార ప్లానిటోరియంలు, సంచార సైన్స్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని సూ చించారు. హైదరాబాద్‌లో 5-డీ థియేటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే జరపాలన్నారు.