వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం | Seven died in Road Accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

Published Wed, Aug 14 2013 4:32 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Seven died in Road Accidents

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. కారు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా.. రోడ్డు దాటుతున్న కూరగాయల వ్యాపారిని ట్రాలీ ఆటో బలిగొంది. దూసుకువచ్చిన టిప్పర్ యువకుడ్ని కబళించగా, అదుపు తప్పిన కారు సబ్ కాంట్రాక్టర్ ప్రాణం తీసింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ కుటుంబ పెద్ద మృతికి కారణం కాగా.. ఓపెన్ నాలా వ్యాపారిని మింగేసింది.
 
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం!
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సుల్తాన్‌బజార్ ఎస్సై ఈశ్వర్‌రావు కథనం మేరకు.. కరీంనగర్ జిల్లాకు చెందిన రాజయ్య (48) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. సైదాబాద్‌లో ఉండే అతడికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఒక కూతురికి వివాహం జరిగింది. రాజయ్య పాత పేపర్లు, సామాన్లు కొని, విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మంగళవారం కుద్బిగూడ దుర్గ డెయిరీ ప్రాంతం నుంచి వస్తున్నాడు. అదే మార్గంలో ఓ సర్వీసు వైరు స్తంభానికి వేలాడుతుండగా, దాన్ని గమనించని రాజయ్య స్తంభం పక్క నుంచి వెళ్తూ దాన్ని పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేపట్టారు. రాజయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
ప్రాణం తీసిన ట్రాలీ ఆటో
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. హుమాయున్‌నగర్ ఎస్సై పురందర్‌రెడ్డి కథనం మేరకు.. ఫస్ట్ లాన్సర్ సయ్యద్‌నగర్‌కు చెందిన నియాజ్ (40) తోపుడు బండిపై కూరగాయలు విక్రయిస్తుంటాడు. ప్రతి రోజూ క్రీసెంట్ ఆస్పత్రిలో సమీపంలోని హోటల్‌లో చాయ్ తాగిన అనంతరమే వ్యాపారం ప్రారంభిస్తాడు. మంగళవారం కూడా చాయ్ తాగిన నియాజ్ రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో మాసబ్‌ట్యాంక్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో (ఏపీ 9 సీబీ 0189) ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోడ్రైవర్ అమీర్‌తో పాటు ఆయన పక్కనే కూర్చున్న మోయిన్ గాయపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
 
కారు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, నవ దంపతులతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి గ్రామం వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా చల్లపల్లి ఠాణాలో ఏఎస్సైగా పని చేస్తున్న తిరుపతి నాగేంద్రరావు మొదటి కుమార్తె శ్రీదేవికి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న బోడా దుర్గాప్రసాద్(26)కి ఈ నెల 9న మచిలీ పట్నంలో వివాహం జరిగింది. సోమవారం హైదరాబాద్‌లో పెళ్లి కుమారుడి ఇంటి వద్ద రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేరోజు రాత్రి తిరిగి పెళ్లికూతురి స్వస్థలానికి కారులో బయల్దేరారు. గుంటుపల్లి వద్దకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ముందు సీట్లో కూర్చున్న పెళ్లి కుమారుడి చిన్నాన్న బోడా అంబేద్కర్ (48) చెట్టుకు, కారుకు మధ్య నలిగి మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న ఆయన భార్య ఎలిజిబెత్ రాణి (45), నూతన దంపతులు దుర్గాప్రసాద్, శ్రీదేవి, కారు డ్రైవర్ నున్న రాజీవ్ (23)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఎలిజబెత్‌రాణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన అంబేద్కర్, ఎలిజిబెత్‌రాణిలు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం సూరపనేనిగూడెం గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. నూతన దంపతులు కోమాలోకి చేరుకోవడంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి కుమారుడు దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో, పెళ్లి కుమార్తె శ్రీదేవి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
యువకుడ్ని బలిగొన్న టిప్పర్
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఎస్పీఆర్ హిల్స్‌లో నివసించే గోరెటి ఆంజనేయులు (24) సోమవారం రాత్రి బైక్ (ఏపీ 09 సీకే 6540)పై కార్మికనగర్ నుంచి బోరబండ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ (ఏపీ 26 యూ 1041) అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఆంజనేయులుకు తీవ్ర గాయాలు కావడంతో పాటు తల పగిలింది. ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. టిప్పర్ బీభత్సంలో మరో ఇద్దరు స్కూటరిస్టులు స్వల్ప గాయాల పాలయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement